2024 Elections: వైసీపీ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. వాళ్లకు మాత్రం లేనట్టే..!

by srinivas |
2024 Elections: వైసీపీ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. వాళ్లకు మాత్రం లేనట్టే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు తిప్పికొడితే ఏడాది కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు దూకుడు పెంచుదామంటే టికెట్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. సర్వేలలో ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలీదు. ఇప్పటి నుంచి మందిని వెంటేసుకుని ప్రజల్లోకి వెళ్తే తీరా ఖర్చంతా పెట్టేశాక టికెట్ లేదంటే పరిస్థితి ఏంటి?, అయినా ప్రతీ గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో ఇప్పటికే సీఎం జగన్ వాళ్లకి సీట్లివ్వం వీళ్లకు సీట్లివ్వం అని తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లు ఉంది. ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఇంకొందరైతే పార్టీని అసలు పట్టించుకోవడమే మానేశారు. టికెట్ రాదని ఫిక్స్ అయిన నేతలు టీడీపీ, జనసేన పార్టీలతో టచ్‌లోకి వెళ్లారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇవన్నీ వైసీపీ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. ఇకపై పార్టీలో ఎలాంటి స్తబ్ధత లేకుండా ఉండేందుకు ఆరు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటించాలనే యోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేశారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థుల ప్రకటన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఒకవైపు ఆర్థిక, అంగబలం. మరోవైపు సామాజిక బలబలాలు. ఇంకోవైపు ప్రజల్లో ఉన్న గ్రాఫ్. ఇవన్నీ ఎలా ఉన్నా సర్వేలలో పాజిటివ్ రిపోర్ట్ వస్తేనే టికెట్. ఒక్క ఎమ్మెల్యే టికెట్ సాధించాలంటే అభ్యర్థులు ఇన్ని పరీక్షలలో పాస్ కావాల్సి ఉంటుంది. లేకపోతే టికెట్ వచ్చే ఛాన్స్ లేనే లేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో 38శాతానికిపైగా అభ్యర్థులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ 60 మందిని పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఎప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష పెట్టినా ఎక్కడ సీటు ఇవ్వమని చెప్తారోనని నేతల్లో టెన్షన్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ వరించేది ఎవరినీ, ఉద్వాసన పలికేది ఎవరికీ అనే దానిపై పార్టీ నేతల్లోనే టెన్షన్ మెుదలైంది. టికెట్ రాదనే అనుమానంతో ఉన్నవాళ్లు ఇప్పటికే సైలెంట్‌గా ఉన్నారు. ఇదే తరుణంలో ప్రతిపక్ష పార్టీతోపాటు జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం యాక్టివ్ అయ్యాయి. దీంతో సీఎం వైఎస్ జగన్ అలర్ట్ అయ్యారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు.

జగన్ పక్కా వ్యూహం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వమని తేల్చి చెప్పిన మరుసటి రోజే ప్లేటు ఫిరాయించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేసేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపైనా సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురుకి సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. దాంతో వారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటు వేసిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అన్న వారు సైతం గోడదూకేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉంటామని ఎమ్మెల్యేలు పైకి చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం నమ్మడం లేదు. పోనీ అప్పటికప్పుడు ఆ మాట చెప్పి సరిపెట్టినా.. ఎన్నికల్లో తమ ప్రతాపం ఏంటో తమపైన తెచ్చిపెట్టిన నాయకుడికి అర్థమయ్యేలా చేయాలనుకుంటారనడంలో సందేహం లేదు. అంటే సహాయ నిరాకరణ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని. అదీ లేదంటే ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీ గేలం పట్టుకుని రెడీగా ఉంది. ఆ గేలంలో అయినా చిక్కుకునేందుకు అయినా రెడీ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిణామాలన్నీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మదిని తొలచివేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే మనతో ఉండేది ఎవరో ఊడేది ఎవరో తెలుస్తోందని ఇంతలో మరో అభ్యర్థిని తయారు చేసుకోవచ్చని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రెండు విడతలలో విడుదల చేస్తారని తెలుస్తోంది. మొదటి విడతలో 80 నుంచి 90 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. అనంతరం మిగిలిన సభ్యులను రెండో జాబితాలో ప్రకటిస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. జూన్‌లో అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే ఎన్నికలకు ఖచ్చితంగా 6 నుంచి 8 నెలల సమయం ఉండే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అభ్యర్థులు అప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తే వైనాట్ 175 సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ టికెట్ దక్కనివారు తిరుగుబాటు చేస్తే అక్కడ బలమైన నాయకత్వాన్ని పెంపొందించేందుకు ఈ సమయం సరిపోతుందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే జూన్‌లో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది.

Advertisement

Next Story