కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: సీఎం జగన్ ఫైర్

by Satheesh |
కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: సీఎం జగన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు సీఎంగా ఉన్న కాలమంతా రాష్ట్రంలో కరువు పరిస్థితులే ఉన్నాయని సీఎం జగన్ విమర్శించారు. మంగళవారం వైఎస్సాఆర్ రైతు భరోసా నాలుగవ విడత నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు వైఎస్సాఆర్ రైతు భరోసా కింద సాయం అందిస్తోందని.. ఇప్పటి వరకు 51.12 లక్షల మంది రైతులకు సహయం చేశామని తెలిపారు. వైఎస్సాఆర్ రైతు భరోసా పథకం కింద ఏటా ఒక్కొ రైతుకు రూ.13500 పంపిణీ చేస్తున్నామన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించలేదని.. కానీ చంద్రబాబు వచ్చినప్పుడల్లా కరువు కచ్చితంగా వస్తోందని ఎద్దేవా చేశారు. 2019 జూన్ నుండి సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని.. మంచి మనస్సుతో పాలన చేస్తే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని అన్నారు. నాలుగేళ్లలో చెరువులు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని.. గత సీఎం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కరువే అని ఎద్దేవా చేశారు. రైతుల కోసం తాము కృషి చేస్తుంటే చంద్రబాబు టీంకు కడుపు మండుతోందని.. కానీ ఆ కడుపు మంటకు మందు లేదన్నారు.

కరువుకు కేరాఫ్ అడ్రస్ అన్యాయస్థుడు చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు. మాది పేదల ప్రభుత్వమైతే.. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ అని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంటే గుర్తుకు వచ్చే పేరు వైఎస్సార్ అని పేర్కొన్నారు. తమ మేనిఫెస్టోలో 98.5 శాతం అమలు చేశామని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇక, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, మాజీ సీఎం చంద్రబాబుకు సీఎం జగన్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని వారికి ఛాలెంజ్ చేశారు.

Next Story

Most Viewed