Nara Lokesh Yuvagalam: రీబిల్డ్ ఏపీని పునర్నిర్మిస్తాం

by srinivas |
Nara Lokesh Yuvagalam: రీబిల్డ్ ఏపీని పునర్నిర్మిస్తాం
X

దిశ, తిరుపతి: 'నా పాదయాత్ర.. ఏపీ యువత భవిష్యత్తు కోసం, దగా పడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం రేణుకాపురం నుంచి కొనసాగింది. ఇందులో భాగంగా బెంగళూరులో స్థిరపడిన జిడి నెల్లూరు వ్యాపారులతో లోకేశ్ భేటీ అయ్యారు. జగన్ పాలనలో జే ట్యాక్స్ బెదిరింపులకి భయపడి.. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారంటూ విమర్శలు చేశారు.

అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం రాణిపురం వద్ద వ్యవసాయ పొలంలో నాగలి పట్టి దున్నారు. జిల్లాలో అమరరాజా పరిశ్రమ వెళ్లిపోవడం వలన దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు. అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడ ఎమ్మెల్యే కమీషన్ల కోసం ఒత్తిడి చేసి, తరిమేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్ని కుప్పకూలిపోయాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. సుమారు రూ.10 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఎద్దేవా చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో రాష్ట్రం అధఃపాతాళానికి దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. తన సొంత ప్రయోజనాలు, అవినీతి సొమ్ము కోసం.. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను, యువత భవిష్యత్తును బలిపెట్టారని విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే.. రీబిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మించి.. అన్ని జిల్లాల్లో మైక్రో క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దాంతోపాటు వివిధ దేశాల నుంచి పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఎగువకమ్మకండ్రిగలో బెల్లం రైతులను కలిసిన లోకేశ్‌.. ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల గురించి అడిగి తెలుకున్నారు. తమను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని బెల్లం తయారీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా రాష్ట్రాలకు వలసలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బెల్లం రైతులను ఆదుకుంటామన్న లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story