Kanipakam: ఇకపై రోజూ 8వేల మందికి అన్నదానం

by srinivas |   ( Updated:2023-03-26 12:10:43.0  )
Kanipakam: ఇకపై రోజూ 8వేల మందికి అన్నదానం
X

దిశ, తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రోజూ ఎనిమిది వేల మందికి అన్నదానం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోజూ రెండువేల మందికి అన్నదానం చేస్తున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలియజేశారు. ఆలయం వద్ద నిర్వహించే వాహన పార్కింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో గతంలో ఆలయానికి 40 శాతం, పంచాయతీకి 60 శాతం చెందేదన్నారు.

అయితే ఆలయానికి విచ్చేసే వాహనాలు నిలిచే స్థలం, పారిశుధ్య నిర్వహణ పూర్తిగా ఆలయం భరిస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగా పంచాయతీకి చెందుతున్న 60 శాతాన్ని 20కి చేసేసి 80 శాతాన్ని ఆలయానికి దక్కేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వచ్చేనెల నుంచి వర్తించేలా చేస్తామన్నారు. వేసవి దృష్ట్యా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మజ్జిగ పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఆలయంలో సిబ్బంది కొరత కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందని, మంజూరైన కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు దేవదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదికలు పంపి ఆమోదం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే దేవదాయ శాఖ మంత్రితో చర్చించి మాస్టర్‌ ప్లాన్‌ను అప్రూల్‌ చేశామని వివరించారు. ఆమోదం పొందిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

అలాగే సామూహిక కల్యాణ మండపంలో మరమ్మతులు నిర్వహించి మే నెల నుంచి తాత్కాలికంగా నిర్వహిస్తామన్నారు. ఆలయంలో రోజూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు, సాయంత్రం ఆరు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత ప్రసాదాన్ని అందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఏకపక్ష నిర్ణయం శోచనీయం: సర్పంచ్‌

పార్కింగ్‌ ఆదాయంలో కాణిపాక ఆలయానికి 80 శాతం, పంచాయతీకి 20 శాతం ఇవ్వాలని ఏకపక్షంగా నిర్ణయించడం శోచనీయమని స్థానిక సర్పంచ్‌ శాంతిసాగర్‌ రెడ్డి విమర్శించారు. 20 ఏళ్ల కిందట అప్పటి నాయకులు, గ్రామ పెద్దలు కలసి ఆలోచించి.. పంచాయతీకి 60 శాతం, ఆలయానికి 40 శాతంగా నిర్ణయించారన్నారు. ఇప్పటి వరకు ఇది కొనసాగుతూ వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఏకపక్ష నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు పార్కింగ్‌ చేసే స్థలం ఆలయానిదే అయినా దానిని ఇచ్చింది గ్రామ ప్రజలేనన్నారు. ప్రజలు, రైతుల త్యాగ ఫలితంగానే ఆలయం అభివృద్ధి చెందిందన్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీకి అన్యాయం జరిగితే సహించమన్నారు. గ్రామ ప్రజలతో కలసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యేను కలసి వివరిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story