Ap News: ప్రభుత్వ మద్యం దుకాణం దగ్ధం.. ఘటనపై అనుమానాలు

by srinivas |   ( Updated:2023-04-03 12:35:39.0  )
Ap News: ప్రభుత్వ మద్యం దుకాణం దగ్ధం.. ఘటనపై అనుమానాలు
X

దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిన్నసింగమాల వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.55 లక్షల విలువ చేసే మద్యం... రూ.15 లక్షల విలువ చేసే ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

శ్రీకాళహస్తి వారులో పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారి పక్కనే చిన్నసింగమాల వద్ద ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ దుకాణంలో ఇటీవల పెద్ద మొత్తంలో అక్రమాలు జరగాయని ఆరోపణ ఉంది. ఈ అక్రమాలపై ఎస్ఈబీ అధికారులకు కూడా సమాచారం అందినట్లు తెలిసింది. ఇంతలోపే ఈ ప్రభుత్వ మద్యం దుకాణం అగ్నికి ఆహుతి కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మద్యం దుకాణంలో పని చేసే సిబ్బంది ఆదివారం రాత్రి విధులు ముగించుకుని యథావిధిగా తాళాలు వేసి వెళ్లారు. సోమవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో మద్యం దుకాణం నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు కొందరు మద్యం దుకాణంలో పని చేసే సిబ్బందికి... అగ్నిమాపకశాఖకి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు ఈ దుకాణంలోని మద్యం, కంప్యూటరు. ఇన్వర్టరు, ఫ్రిజ్ వంటి ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మద్యం దుకాణంలో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో దగ్ధం అయ్యాయని ఎస్ఈబీ అధికారులు చెబుతున్నారు.

అయితే మద్యం దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాలేదని ఆ శాఖ అధికారులు అంటున్నారు. మద్యం దుకాణంలో మంటలు చెలరేగిన తరువాత చిన్నసింగమాలకు చెందిన ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి అగ్ని ప్రమాదం జరిగిందని... విద్యుత్ సరఫరా కొంతసేపు ఆపాలని కోరడంతో కొంతసేపు సరఫరా ఆపినట్లు వారు చెబుతున్నారు. మద్యం దుకాణం ఎలా ఆహుతైందో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు.

కాగా చిన్నసింగమాల ప్రభుత్వ మద్యం దుకాణంలో జరిగిన అక్రమాలు బయట పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఓ పథకం ప్రకారం తగులబెట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ నాసిరకం మద్యం కూడా విక్రయించే వారని ఆరోపణ కూడా బలంగా ఉంది. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా లోతైన విచారణ జరిపితే ఇక్కడ మద్యం దుకాణం ఎలా తగులబడిందనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Advertisement

Next Story