టీడీపీ కార్యకర్తల మృతితో చంద్రబాబు ఎంతో బాధపడ్డారు: నారా భువనేశ్వరి

by Seetharam |
టీడీపీ కార్యకర్తల మృతితో చంద్రబాబు ఎంతో బాధపడ్డారు: నారా భువనేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్నా ఆయన మనసంతా ప్రజలపైనే ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. తిరుపతి జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున భువనేశ్వరి చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. పరామర్శకు ముందు నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేధనకు గురై చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ సెప్టెంబర్ 25న మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బుధవారం కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ‘పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు వారిని కలిసి భరోసా ఇవ్వడం మా బాధ్యత. అరెస్టును జీర్ణించుకోలేక కార్యకర్తలు చనిపోయారన్న విషయం తెలుసుకుని చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. ఆయన జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉంది. మా కుటుంబం కంటే కార్యకర్తలపైనే ఆయనకు ధ్యాస ఎక్కువ. ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ మృతి బాధాకరం. ప్రవీణ్ రెడ్డి చనిపోయిన రెండు రోజులకు బిడ్డ పుట్టాడని తెలిసింది..బిడ్డను చూసుకునే రాత ప్రవీణ్ రెడ్డికి లేదన్న విషయం చాలా బాధేసింది. కుమారుడిగా తల్లిదండ్రులకు ప్రవీణ్ రెడ్డి ఎలా అండగా ఉన్నారో..పార్టీ కూడా అంతే అండగా ఉంటుంది’ అని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

చంద్రబాబు అరెస్టు జీర్ణించుకోలేక మృతి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి, కనుమూరి చిన్నబ్బ కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed