పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. పవన్ కల్యాణ్‌కు ఒప్పించే బాధ్యత!

by GSrikanth |   ( Updated:2024-02-05 14:37:10.0  )
పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. పవన్ కల్యాణ్‌కు ఒప్పించే బాధ్యత!
X

బీజేపీతో కలసి ఎన్నికలకు వెళ్లేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్లు స్పష్టమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్​ కల్యాణ్​ భేటీలో ఈ అంశంపై ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో పొత్తు కావాలనుకున్న వాళ్లే తమ పార్టీ పెద్దలను సంప్రదించాలని ఇటీవల ఆ పార్టీ నేత విష్ణుకుమార్​ రాజు వ్యాఖ్యానించారు. దీనిపై పవన్​ కల్యాణ్​ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు రెండు ఎంపీ, ఏడు అసెంబ్లీ సీట్లు అడిగారట. బాబు మాత్రం ఓ ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్దమన్నారట. కాషాయ పార్టీ పెద్దలను ఒప్పించే బాధ్యతను చంద్రబాబు పవన్​కు అప్పగించినట్లు భోగట్టా.

దిశ, ఏపీ బ్యూరో: కేంద్రం గత నాలుగున్నరేళ్ల నుంచి వైసీపీ సర్కారుకు వెన్నుదన్నుగా నిలిచింది. జగన్​ కేసులతోపాటు అప్పులకు ఎడాపెడా అనుమతులిచ్చే దాకా తెర వెనుక నుంచి సాయపడుతూ వచ్చింది. ప్రతిపక్ష టీడీపీ ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎన్ని ఫిర్యాదులు చేసినా.. కేంద్రం ఏమాత్రం స్పందించలేదు. విశాఖ సభలో అమిత్​ షా పొడి పొడి విమర్శలు తప్ప వైసీపీని ఇబ్బందిపెట్టే ఎలాంటి చర్యలనూ కేంద్రం తీసుకోలేదు. చివరకు చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో జైలుకు పంపడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం సాగింది. టీడీపీ శ్రేణులు సైతం బీజేపీతో పొత్తును అంగీకరించడం లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నేరుగా బీజేపీ పెద్దలను కలవకుండా పవన్​ ద్వారా రాయబారం నడపాలని నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఆ బాధ్యత పవన్ కే..

బాబు, పవన్​ తాజా భేటీలో బీజేపీతో పొత్తు అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈపాటికే పవన్​ ఆ పార్టీ పెద్దలు ఎన్ని సీట్లు అడుగుతున్నారనేది చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. రెండు ఎంపీ, ఏడు అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు చెప్పారు. ఓ ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు ఒప్పించేలా మాట్లాడాలని బాబు జనసేనానికి సూచించారు. జనసేనకు ఎన్ని సీట్లనే విషయం మీద కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. మూడు ఎంపీ, 25 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించే విషయంపై చర్చలు ఓ కొలిక్కి రానట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో బీజేపీకి ఎన్ని కేటాయించాల్సి వస్తుందనే దాన్ని బట్టి జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు కావొచ్చని తెలుస్తోంది.

పొత్తుతో మారనున్న మేనిఫెస్టో..

టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఈపాటికే ఖరారైంది. బీజేపీ కూడా కలిస్తే మార్పులు చేయాల్సి ఉంటుంది. అందువల్ల కమలనాథులతో పొత్తు అనంతరం ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో ఏఏ అంశాలు ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బీజేపీపై జనాగ్రహం..

గతంలో బీజేపీ ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలతోపాటు ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఆ ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంది. ఇప్పుడు మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారనే గుబులు మూడు పార్టీల్లో ఉంది. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లేట్లయితే కేంద్ర సర్కారు ప్రజల మద్దతు పొందేందుకు ఏదో ఒకటి చేస్తుందని టీడీపీ –జనసేన శ్రేణులు భావిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Read More..

జనసేనలో చేరిన MP బాలశౌరి ఒక బఫూన్.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story