చంద్రబాబు దంపతుల ప్రత్యేక యాగాలు: ఆధ్యాత్మిక సేవలో మూడురోజులు

by Seetharam |
చంద్రబాబు దంపతుల ప్రత్యేక యాగాలు: ఆధ్యాత్మిక సేవలో మూడురోజులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈమధ్య అసలు కాలం కలిసిరావడం లేదు. వరుస కేసులు, ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల జీవిత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కోర్టుమెట్లెక్కారు. అంతేకాదు ఏకంగా 53 రోజులపాటు జైలు జీవితం సైతం గడిపారు. స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపిన చంద్రబాబు నాయుడు తనకు కాలం కలసిరావడం లేదని భావించిన ఆయన ఆధ్యాత్మిక చింతనలో గడపాలని భావించారు. అందులో భాగంగా స్కిల్ స్కాం కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం ప్రముఖ దేవాలయాలను చంద్రబాబు సందర్శించారు. అంతేకాదు ప్రత్యేక పూజలు నిర్వహించి మెుక్కులు చెల్లించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పావులు కదుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఈ ప్రత్యేక యాగాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాగాల్లో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొనబోతున్నారు.

దైవానుగ్రహం కోసం

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యం. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సంకల్పించుకున్నారు. సంకల్పబలంతోపాటు దైవ అనుగ్రహం కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేక యాగాలు చేయాలని నిర్ణయించారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు నారా లోకేశ్ సైతం అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు సైతం ఎదుర్కొంటున్న కేసుల్లో ఎప్పుడు జైలుకెళ్తారో అన్న ఆందోళన సైతం పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక యాగాలు చేపడుతుండటం విశేషం.

అపాయింట్మెంట్లు రద్దు

గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న నివాసంలో చంద్రబాబు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు యాగాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొనే ఈ యాగాల కోసం ఉండవల్లి నివాసంలో భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు, పూజలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ మూడు రోజులపాటు ఎలాంటి అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది.

వరుసగా ఆలయాలను సందర్శించిన బాబు

ఇకపోతే ఇటీవలే స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబు నాయుడు వరుసగా ఆలయాలను దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బెజవాడ కనకదుర్గమ్మ,శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్నలను సైతం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈనెల 21న గుణదల మేరీమాత ఆలయాన్ని సైతం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. అంతేకాదు తళనాడు వెళ్లి అక్కడి ఆలయాలను కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే.తాజాగా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed