రెండు పార్టీల వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేనా?

by Jakkula Mamatha |
రెండు పార్టీల వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేనా?
X

దిశ,మడకశిర:రాజకీయంలో అయోమయం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో వర్గాపోరుతో పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.మాజీ ఎమ్మెల్యే ఈరన్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వర్గ పోరు కొనసాగుతోంది. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ కు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో గుండుమల తిప్పేస్వామి వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు టీడీపీ అధిష్టానం నియమించిన సునీల్ కుమార్ కు సహకరిస్తారా లేక అధిష్టానం పై తిరుగుబాటు ఎగరేస్తారా అనే సంశయం నియోజకవర్గం ప్రజలలో నెలకొంది. ఈ మేరకు ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా సతమతం చెందుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామికి కాకుండా ఈరలకప్పను తెరపైకి తీసుకురావడంతో పలమనేరు తిప్పేస్వామి వర్గీయులు అసంతృప్తికి లోనవుతున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయులు కొత్త అభ్యర్థి ఈరలకప్పకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారన్న ఆలోచన మేలుకుంది. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న అయోమయంతో కాంగ్రెస్ పార్టీ వైపు రెండు పార్టీల కార్యకర్తలు చూస్తున్నట్లు రెండు పార్టీల వర్గాలలో చర్చలు జోరు అందుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి ప్రస్తుతం సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి ఇటీవల కాలంలో మడకశిర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండడంతో మడకశిర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతుండడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకుంటే మడకశిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Next Story