బలరాముడికే పట్టం: జనసేన ఖాతాలో ఆ నియోజకవర్గం?

by Seetharam |
బలరాముడికే పట్టం: జనసేన ఖాతాలో ఆ నియోజకవర్గం?
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకంగా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓటమి పాలవ్వడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కసితో ఉన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించి కింగ్ లేదా కింగ్ మేకర్ కావాలని పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన గెలుపొందే స్థానాలపై జనసేన ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో పాగా వేసేందుకు జనసేన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ వ్యాపార వేత్త బత్తుల బలరామకృష్ణ పోటీ చేయనున్నారు. వ్యాపారవేత్తగా, ప్రజా సేవకుడిగా పేర్గాంచిన బత్తుల బలరామకృష్ణకు ప్రజల్లో మంచి పేరు ఉండటంతో ఈసారి రాజానగరం జనసేన ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన అధిష్టానం సైతం తొలి సీటుగా రాజానగరం నియోజకవర్గం అభ్యర్థిగా బలరామకృష్ణనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్న బత్తుల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా పట్టున్న ప్రాంతం కావడంతో జనసేన కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా గెలుపొందే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం జనసేన పార్టీకి మంచి పట్టు ఉన్న రాజానగరం నియోజకవర్గం ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బత్తుల బలరామకృష్ణ పోటీ చేయడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తారని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం బత్తుల బలరామకృష్ణయే అభ్యర్థి అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బత్తుల బలరామకృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

గ్రూపు రాజకీయాలకు చెక్ పడినట్లే

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా రాయపురెడ్డి చిన్నా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపురెడ్డి చిన్నా వైసీపీలో చేరారు. అనంతరం మేడా గురుదత్తప్రసాద్ జనసేనలో కీలకంగా మారారు. జనసేన పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు. అనంతరం జనసేన పార్టీ అధిష్టానం బత్తుల రామకృష్ణను ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో మేడా గురుదత్త ప్రసాద్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి వరకు రాజానగరం నియోజకవర్గం జనసేనలో గ్రూపు రాజకీయాలు ఉండేవి. అయితే జనసేన పార్టీలో పనిచేసిన వారు పార్టీ వీడటంతో గ్రూపు రాజకీయాలకు చెక్ పడినట్లు అయ్యింది. ఇప్పుడు జనసేనకు బత్తుల రామకృష్ణ దిక్కుగా మారారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి క కూడా బత్తుల రామకృష్ణే కావడంతో నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన పార్టీ ఏకతాటిపైకి వచ్చింది. మరోవైపు బత్తుల బలరామకృష్ణ అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తుండటంతో ఊహించని రీతిలో ఆయనకు మద్దతు పెరిగింది. దీంతో జనసేన ఖాతాలో రాజానగరం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed