YSR District: కడప జీజీహెచ్‌లో ఆడిట్ గుబులు!

by Indraja |
YSR District: కడప జీజీహెచ్‌లో ఆడిట్ గుబులు!
X

దిశ ప్రతినిధి, కడప: జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నిర్వాహకుల్లో ఆడిట్ గుబులు నెలకొంది. 2015 నుంచి 2024 సంవత్సరం వరకు పదేళ్లుగా ఆడిట్‌కు నోచుకోలేదు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఆడిట్ చేయాల్సి వుంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల స్టేట్ ఆడిట్ యంత్రాంగం రాష్ర్టంలో వైద్యశాలల ఆడిట్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా సర్వజన ఆసుపత్రి (రిమ్స్) చేసిన ఖర్చులపై ఆడిట్ చేపట్టింది. ఇందులో ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు జిజిహెచ్ క్రయ, విక్రయ పద్ధతుల పారదర్శకతను పరిశీలించింది.

నిర్వాహకుల్లో గుబులు..

గత మూడు వారాలుగా కడప నగరంలోని ఓ హోటల్, జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని రెండేసి గదుల్లో ఆడిట్ యంత్రాంగం బసచేసింది. జీజీహెచ్ క్రయ, విక్రయాలు, రెండు క్యాంటీన్ల అద్దెలు, దోబి, ప్రాణవాయువు, ఎం.ఆర్.ఐ, సిటీ స్కానింగ్ మీటర్లు వంటి పలు విభాగాల్లో పెద్ద ఎత్తున లోపాలను గుర్తించినట్లు సమాచారం. కోట్లాది రూపాయల విలువ కలిగిన లోపాలపై జీజీహెచ్ నిర్వాహకుల్లో గుబులు రేగుతోంది. వీటితో పాటు డ్రగ్స్ కొనుగోళ్లలో నెలకొన్న గందరగోళాన్ని పరిశీలించినట్లు తెలిసింది. ఆడిట్ నివేదికను గురువారం అందజేయనున్నట్టు సమాచారం. స్టేట్ ఆడిట్ ఉన్నతాధికారులు నివేదిక పరిశీలన అనంతరం అవకతవకల రికవరీ, లేదా బాధ్యులైన అధికారులపై చర్యలకు సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed