Andhra Pradesh News : ఓటుకు ఎదురీదుతున్న నోటి మంత్రులు

by Mahesh |   ( Updated:2024-05-05 12:05:38.0  )
Andhra Pradesh News : ఓటుకు ఎదురీదుతున్న నోటి మంత్రులు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరానంతగా రెచ్చిపోయారు. అధినేత వద్ద మంచి మార్కుల కోసం ప్రతిపక్ష నేతలను హద్దు మీరి, పరిధి దాటి విమర్శించారు. సైద్ధాంతిక విమర్శలు, రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా కుటుంబ సభ్యులపై, మహిళల పై అసత్య ప్రచారాలు, ఆరోపణలతో పూర్తిగా దిగజారుడు వైఖరి ప్రదర్శించారు. ఇప్పుడు ఓటర్లు కూడా వీరిని అంతకంటే దారుణంగా చూస్తున్నారు. సభ్యత లేని వీరిని చట్టసభలకు పంపించాల్సిన అవసరం లేదంటూ నిరాదరణకు గురి చేస్తున్నారు.

అమాత్య పదవులలో ఉండే ఇలా..

మంత్రులుగా ఉన్న వీరు ప్రతిపక్ష నాయకుల పై ఎదురు దాడి అనగానే బూతులతో, అసభ్య పదజాలాలతో సిద్ధమైపోయేవారు. తిట్ల దండకంలో వీరిలో వీరే పోటీలు పడేవారు. చాలా బూతులను నిత్యం పఠిస్తూ జనానికి అలవాటు చేసేశారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా, నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సత్తెనపల్లి నుంచి గెలుపొందిన మంత్రి అంబటి రాంబాబు, పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందిన మంత్రి జోగి రమేష్, గుడివాడ నుంచి గెలిచిన మాజీ మంత్రి కొడాలి నాని, అనకాపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి మారిన వల్లభనేని వంశీ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తదితరులంతా ఈ కోవకు చెందిన వారే. వీరందరికీ చిన్న మార్పులతో టిక్కెట్లు లభించినప్పటికీ గెలుపు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కంటే ప్రతిపక్ష నేతలను రకరకాలుగా, కొత్త కొత్త పదజాలాలతో తిట్టి అధినేత వద్ద మెప్పు పొందడానికి మీరు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఇప్పుడు జనం నిరాకరిస్తున్నారు.

అన్ని సర్వేల్లో వీరికి ఓటమి

వారం రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో నోటికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వీరికి జనం ఓటుతో బుద్ధి చెప్పనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కూటమి పక్షాలకు అనుకూలంగా ఉన్న సర్వే లతోపాటు వైసీపీకి అనుకూలమైన వాటిలో కూడా వీరిలో చాలామంది విజయావకాశాలు కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం నిలబడిన రైస్ సంస్థ సర్వే, పీపుల్స్ పల్స్ సర్వే‌లలో వీరందరికీ ఓటమి తప్పదు అనే అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా వెలువడిన ఆర్టీవీ సర్వేలోనూ అలాగే వచ్చింది.

ప్రచారంలోనూ అదే దూకుడు

పదవుల్లో ఉన్నప్పుడే కాదు, చివరకు ఎన్నికల ప్రచారంలో కూడా నోటినే నమ్ముకున్న ఈ నేతలు అలాగే దూకుడు ప్రదర్శిస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండగా, పదవిలో ఉండగా అలవాటైన విమర్శలను తిట్లను మరిచిపోలేక ఇబ్బందుల పాలవుతున్నారు. దిగజారుడు ప్రవర్తనను ప్రజలు భరించలేరన్న విషయాన్ని గుర్తించకుండా అతి ప్రవర్తనతో అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారు.

Also Read: మంత్రి అమర్నాధ్ సవాల్.. పెద్ద జోక్!

ముద్రగడకు ముచ్చెమటలు పట్టిస్తున్న కన్న కూతురు.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో వీడియో వైరల్..

Advertisement

Next Story

Most Viewed