Andhra Pradesh: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అన్నవరం

by Indraja |   ( Updated:2024-06-10 05:06:08.0  )
Andhra Pradesh: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అన్నవరం
X

దిశ, అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రైవేటు లాడ్జీలు, రెసిడెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఏ మాత్రం చిన్న జాగా ఉన్నా లాడ్జి నిర్మాణాన్ని చిటికలో నిర్మించేస్తున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే లాడ్జీల నిర్మాణాలు సాగిస్తుండడంతో ప్రతి ఒక్కరి దృష్టి దీనిపై పడింది. ఒక్కసారి లాడ్జి నిర్మించుకుంటే ఆర్థిక పరంగా జీవితకాలం పాటు చూసుకోనవసరం లేదని ధీమా నిర్వాహకుల్లో లోతుగా నాటుకుపోయింది.

అన్నవరంలో చాలా లాడ్జిలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదనపై దృష్టి సారించిన వీరు ఆర్థిక పరంగా ఎదగాలనే ఆకాంక్షతో అడ్డదారులకు తెర తీస్తున్నారు. అన్నవరంలో యూనియన్ బ్యాంకు దగ్గర నుంచి కరుణకుమార్ హోటల్ వరకు మెయిన్ రోడ్డుకు అనుకుని సుమారు 36 లాడ్జిలు ఉన్నాయి.

వీటిలో చాలావరకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండానే నిర్వహణ సాగిస్తున్నారు. చేతివాటానికి అలవాటు పడ్డ అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరించడం ఎటువంటి తనిఖీలు పర్యవేక్షణ చేయకపోవడం నిర్వాహకుల పాలిట వరంగా మారింది.

పోలీసుల కళ్లు కప్పి..

అన్నవరం కొండపైన భక్తుల సౌకర్యార్థం సుమారు 500 సత్రం గదులు ఉన్నప్పటికీ కొండ దిగువన ఉన్న లాడ్జిలు సీజన్ అన్ సీజన్ అనే తేడా లేకుండా నిరంతరం కలకలలాడుతూనే ఉంటాయి. ఈ లాడ్జిల్లో ఓ 20 శాతం భక్తులు బస చేయగా మిగతా 80 శాతం గదులు అసాంఘిక కార్యకలాపాలకు, గంజాయి స్మగ్లింగ్‌కు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

ప్రతి లాడ్జిలోనూ రిజిస్టర్ బుక్ మెయిన్‌టైన్ చేయవలసి ఉండగా, రెండు బుక్‌లు మెయింటైన్ చేయడం ఇక్కడ నిర్వాహకుల గొప్పతనం. పోలీసులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ వారి కళ్లు కప్పి లాడ్జిల నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసారన్న అనుమానాలను స్థానికులు వ్యక్తపరుస్తున్నారు.

దీనిపై ప్రభుత్వ వివిధ శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించి లాడ్జీలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తే కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు బట్టబయలవుతాయని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed