AP BJP: ఏపీ రాజకీయాల్లో కొత్త టర్న్.. ఆ పార్టీతో చెలిమి కట్!

by srinivas |
AP BJP: ఏపీ రాజకీయాల్లో కొత్త టర్న్.. ఆ పార్టీతో చెలిమి కట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీపై బీజేపీ స్టాండ్ మారిందా..? ఇక చెలిమి కట్ అయినట్లేనా? గతంలో ఎన్నడూ లేని విధంగా కమలనాధులు వైసీపీపై దూకుడు పెంచడం అందులో కారణమేనా? ఇదంతా బీజేపీ వైసీపీతో లేదని తెలియజేసేందుకేనా? లేక పవన్ కల్యాణ్ ఒత్తిడితో ఇక అమితుమీకి సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దివంగత సీఎం వైఎస్ఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రాజకీయం చేశారు. అయితే ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. బీజేపీ సైతం వైఎస్ఆర్‌పై రాజకీయంగా కత్తులు దూసిన సంగతులు లేకపోలేదు. వైఎస్ఆర్ మరణం అనంతరం బీజేపీలో మార్పు వచ్చింది. వైఎస్ఆర్ రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ ఆయన తనయుడుకు మాత్రం జై కొడుతోంది. వైఎస్ జగన్‌కు అండగా నిలుస్తోంది. అంతేకాదు వైసీపీ సైతం బీజేపీకి సహాయసహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సహాయ సహకారాలే బీజేపీ కొంపముంచింది. బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లడంతో బీజేపీ నేతలు తమ ఉనికిని కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఆ ముద్రను చెరిపివేసుకునేందుకు యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీపై పోరుకు సై అంటోంది. దీంతో బీజేపీ, వైసీపీల మధ్య కొత్త రాజకీయ పరిణామాలు నెలకొన్నాయి.

చీకటి చెలిమి

2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాయి. అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే కేంద్రంలోని బీజేపీ ఇటు రాష్ట్రంలోని టీడీపీల మధ్య విభేదాలు రావడంతో పొత్తు చెడింది. దీంతో కేంద్రంలోని టీడీపీకి చెందిన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా రాష్ట్ర కేబినెట్‌లోని బీజేపీకి చెందిన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. టీడీపీపై యుద్ధానికి సై అంటూనే మరోవైపు వైసీపీతో చెలిమి చేసింది. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ టీడీపీని టార్గెట్ చేసిందే కానీ వైసీపీని ఎక్కడా టార్గెట్ చేయలేదన్నది నగ్న సత్యం. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ వైసీపీతో సత్సంబంధాలు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ వైసీపీపై పోరాటానికి సై అన్నారు. వైసీపీతో విభేదించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన సోము వీర్రాజు వైసీపీతో సత్సంబంధాలు నెరిపారనేది బహిరంగ రహస్యం. పైకి విమర్శలు చేస్తున్నప్పటికీ చీకట్లో కౌగిలించుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాదు రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేని నేపథ్యంలో వైసీపీ తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. చాలా బిల్లులకు మద్దతు ప్రకటించింది. ఇలా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ, వైసీపీల మధ్య చెలిమి నడిచిందన్నది ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్న ప్రచారం.

విమర్శల జోరు పెంచిన బీజేపీ

బీజేపీ, వైసీపీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ ప్రచారం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతీ గల్లీలోనూ బీజేపీ, వైసీపీ ఒక్కటేనన్న ప్రచారం విపరీతంగా వెళ్లింది. పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఈ ప్రచారమే కారణమని పార్టీ నేతలు విష్ణుకుమార్ రాజు, పీవీఎన్ మాధవ్ లాంటి వ్యక్తులు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ సైతం బీజేపీ వైఖరిని తప్పుబడుతున్నారు. తమతో పొత్తులో ఉంటూనే వైసీపీతో సత్సంబంధాలు నెరపడంపై మండిపడుతున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని బీజేపీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రచారం కారణంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనాని సహకరించలేదని తెలుస్తోంది. ఈ అంశాలపై అధ్యయనం చేసిన బీజేపీ నాయకత్వం ఇక వైసీపీపై పోరుకు శ్రీకారం చుట్టింది. నిన్న మొన్నటి వరకు స్నేహం చేసిన బీజేపీ ఇక పొలిటికల్ యుద్ధానికి సై అంటోంది. వైసీపీని ఢీ కొడతాం అంటోంది. ఇప్పటికే అధికార వైసీపీపై ఛార్జి షీట్ లు అంటూ కమల దళం హడావిడి చేస్తోంది. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో చార్జిషీట్ దాఖలు చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడితో ఆగిపోలేదు... సీఎం వైఎస్ జగన్‌పైనా అటు మంత్రులు, మాజీమంత్రులపైనా విమర్శల దాడికి దిగుతుంది. దీంతో వైసీపీ విషయంలో బీజేపీ రూట్ మార్చిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

వైసీపీ ధీమా మాత్రం ఇదే

రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. కనీసం చార్జిషీట్లపైనా నోరు మెదపడం లేదు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతల విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని వైసీపీ భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం మాత్రం ఏదో ఒక సందర్భంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంది. సీఎం వైఎస్ జగన్‌ను కానీ జగన్ సర్కార్‌ను కానీ విమర్శించిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలో స్థానిక బీజేపీ నాయకులపై విమర్శలు చేసి కేంద్రంలోని స్నేహాన్ని తెంచుకోవద్దనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ నేతలు చార్జిషీట్‌లు వేస్తే ఏంటి..విమర్శలు చేస్తే ఏంటి.. కేంద్రంలో మోడీ, అమిత్ షాల ఆశీస్సులు ఉన్నంత వరకు ఏం పర్వాలేదనే భావనలో వైసీపీ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed