AP:ఆ జిల్లాలో బయల్పడిన 10వ శతాబ్దం నాటి సూర్యుడి విగ్రహం

by Jakkula Mamatha |
AP:ఆ జిల్లాలో బయల్పడిన 10వ శతాబ్దం నాటి సూర్యుడి విగ్రహం
X

దిశ, రాయదుర్గం:అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామం లో చారిత్రక ప్రాధాన్యం గల సూర్యుని విగ్రహం బయల్పడింది. కలుగోడు గ్రామానికి చెందిన రైతు హరిజన వన్నూరప్ప కుమారుడు నాగేంద్ర శుక్రవారం తన పొలంలో దుక్కి దున్నుతూ ఉండగా సుమారు రెండు అడుగుల ఎత్తు గల రాతి విగ్రహం బయల్పడింది. ఈ విషయం నా దృష్టికి రావడంతో క్షేత్ర పర్యటన జరిపి ఆ విగ్రహం గురించి ప్రముఖ చరిత్ర పరిశోధకులు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా వారికి ఈ శిల్పం ఫోటోలు పంపడం జరిగింది. ఆయన ఈ విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు తెలిపారు.

వేదవతి నది ఒడ్డున బయటపడిన ఈ విగ్రహం సూర్యుడిని రెండు చేతులలో పద్మాలు ధరించాడని, శిల్ప శైలిని బట్టి ఈ ప్రాంతాన్ని పాలించిన నొళంబ పల్లవులు శైలికి అద్దం పడుతుందని, క్రీస్తుశకం పదవ శతాబ్దానికి చెందినదని తెలిపారు. పొలంలో రాతి విగ్రహం బయటపడటంతో ఈ విషయం పొలం యజమాని గ్రామ తలారి గంగప్ప, గ్రామ రెవెన్యూ అధికారి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన గుమ్మగట్ట మండలం తహసిల్దార్ వెంకట చలపతి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పోలీస్ రాజేష్ వచ్చి విగ్రహాన్ని పరిశీలించారు. బొమ్మక్క పల్లి రాజరాజేశ్వరి ఆలయ అర్చకులు విగ్రహం లభించిన చోట విగ్రహానికి పూజలు జరిపారు. ఈ విగ్రహం లభించిన చోటు సమీపంలోని ఇతర విగ్రహాలు లభించే అవకాశం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సూర్య భగవాన్‌ని శిల్పం లభించడంతో ఇక్కడ అ సూర్యదేవాలయం ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed