సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

by Seetharam |   ( Updated:2023-10-18 12:46:46.0  )
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావుకు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దును సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలు ఆరోపణలతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా... సీఐడీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా సీఐడీ విచారణకు సహకరించాలని ఆదిరెడ్డి అప్పారావుకు సుప్రీంకోర్టు సూచించింది. విచారణకు సహకరిస్తారని సుప్రీంకోర్టుకు సిద్ధార్థ లూథ్రా హామీ ఇచ్చారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Advertisement

Next Story