జనసేనలో చేరికల చిచ్చు.. ఆ ముగ్గురి జాయినింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న జనసైనికులు..!

by Satheesh |
జనసేనలో చేరికల చిచ్చు.. ఆ ముగ్గురి జాయినింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న జనసైనికులు..!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ జనసేనలో చేరికలు చిచ్చు రేపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లతో పాటు వైసీపీలో కీలక నేతలను జనసేనలో ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా, బ్యాక్ గ్రౌండ్ చూడకుండా చేర్చేసుకోవడమేమిటని పదేళ్లుగా జనసేనలో ఉన్నవారు, వైసీపీ పాలనా కాలంలో కేసులు ఎదుర్కొని అష్టకష్టాలు పడ్డ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పలువురు నేతలు బుధవారం చేరనున్నారనే సమాచారం నేపథ్యంలో జనసేన అధిష్టానానికి మొదటినుంచి పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు.

బెహర భాస్కరరావును ఎలా చేర్చుకొంటారు..?

విశాఖ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన బెహరా భాస్కరరావు గతంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కార్పోరేటర్‌గా చేశారు. విజయసాయ రెడ్డికి కీలక అనుచరుడైన ఆయన తొట్ల కొండ ఎదుట నిబంధనలకు విరుద్ధంగా టూరిజం కాటేజ్ నడుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో హవా చెలాయించారు. జనసేన కార్యకర్తలపై పశ్చిమ నియోజక వర్గంలో కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. స్వయంగా బెరహాపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెండింగ్‌లో ఉంది. కేవలం ఆస్తులను కాపాడుకొనేందుకు, కేసుల నుంచి బయటపడేందుకు వస్తున్న ఆయనను చేర్చుకోవడాన్ని జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఎంవీవీ కుడిభుజం శివగణేష్ కూడానా..?

వైసీపీకి చెందిన విశాఖ మాజీ ఎంపీ, వేల కోట్ల వివాదాస్పద ఆస్తులను కూడబెట్టిన నేతగా పేరుపడ్డ ఎంవీవీ సత్యనారాయణ ఆత్మ లాంటివాడైన విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్‌ను చేర్చుకొనే ప్రయత్నం చేయడంపైగా జనసైనికులు భగ్గుమంటున్నారు. వివాదాస్పద సీబీసీఎన్‌సీ, హయగ్రీవ ప్రాజెక్టులు ఆగిపోయిన నేపధ్యంలో వాటికోసం పైరవీలు చేస్తున్న శివ గణేష్ ఎంవీవీని రక్షించేందుకే జనసేనలో చేరుతున్నారని అంటున్నారు. వీరితో పాటు వివాదాస్పదనేతగా పేరొందిన కనకమహాలక్ష్మీ ఆలయం మాజీ చైర్మన్, వైసీపీ నేత జెర్రిపోతుల ప్రసాద్, మాజీ కార్పోరేటర్ బోదిల పాటి ఉమామహేశ్వరరావులను చేర్చుకోవడంపై నిరసన వ్యక్తమవుతోంది.

ఉషశ్రీకి డిప్యూటీ మేయర్..?

వైసీపీకి చెందిన 43వ వార్డు కార్పోరేటర్ పెద్ది శెట్టి ఉషశ్రీ కూడా పార్టీలో చేరే నేతల జాబితాలో ఉన్నారు. ఆమెను పార్టీలో చేర్చుకొని విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేన కోటాలో కట్టబెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. విచిత్రంగా జనసేన రాష్ర్ట సమన్వయ కర్తగా 2019 వరకూ పనిచేసిన ఆమె వైసీపీ గెలవడంతో జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోగానే జనసేనలోకి వెళుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఇటువంటి వారికి జనసేన ఎలా ప్రాధాన్యత ఇస్తుందని జనసైనికులు మదన పడుతున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సీనియర్ నేత కోన తాతారావు, భీమిలి సమన్వయ కర్త పంచకర్ల సందీప్‌లు ఈ చేరికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. పార్టీ కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed