ఏపీ లాక్ డౌన్… 31 వరకు ఇవే నిబంధనలు: జగన్

by srinivas |
ఏపీ లాక్ డౌన్… 31 వరకు ఇవే నిబంధనలు: జగన్
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ ప్రకటించారు. కరోనాను నియంత్రించాలంటే కష్టమైనప్పటికీ ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని తెలిపారు. అంతర్రాష్ట్ర రవాణాను రద్దు చేశామని చెప్పారు. ప్రజా రవాణాను నియంత్రించామని స్పష్టం చేశారు. ఒకరికొకరుగా నిలబడి మనల్ని, మనవారిని రక్షించుకుందామని జగన్ పిలుపునిచ్చారు.

మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. నెల్లూరులో ఒక కరోనా కేసులో బాధితుడు నయమై ఇంటికెళ్లారని ఆయన చెప్పారు. అయితే దీనికి కారణం వైద్యులైతే.. పరోక్షంగా 2,50 వేల పైచిలుకు గ్రామ వలంటీర్లని ఆయన అన్నారు. వారు చేసిన సర్వే ఫలితంగానే తాము చర్యలు తీసుకోగలిగామని అన్నారు. వారికి కేటాయించిన యాప్ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలు వెల్లడించడం జరిగిందని ఆయన చెప్పారు. వారిచ్చిన వివరాలతో హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేసుకోవడంతో పీహెచ్‌సీ డాక్టర్‌ వారిని మానిటర్ చేసే సౌకర్యం కలిగిందని ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో 11,670 మంది విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు వలంటీర్లు అందించారని చెప్పారు. అందులో 10,091 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అన్నారు. వారిలో మరో 24 మంది కరోనా లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించామని, అనుమానితులను హోం ఐసోలేషన్‌లో ఉంచామని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

కరోనా కట్టడికి ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు ఐసోలేషన్, క్వాంరటైన్ సౌకర్యాలు కలిగిన ఆసుపత్రిని తయారు చేసే ప్రక్రియ ముమ్మరం చేశామన్నారు. జిల్లా కేంద్రాల్లో 200 పడకలు కలిగిన అత్యాధునిక సౌకర్యాలందించే ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. కరోనా వంటి లక్షణాలు కనిపిస్తే వారిని ఫారిన్ ట్రావెల్ రికార్డు చెక్ చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చినా, వచ్చిన వారిని కలిసినా 104కి ఫోన్ చేయండని ఆయన సూచించారు. ఆ తరువాతి సంగతిని డాక్టర్లే చూసుకుంటారని ఆయన తెలిపారు.

కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు 31వ తేదీ వరకు మూసేశామని ఆయన చెప్పారు. పపదో తరగతి పరీక్షలు నిర్వహించక తప్పదని ఆయన చెప్పారు. ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడితే వారికి విడిగా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో 2 మీటర్ల దూరంతో వారిని కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. పెద్ద పెద్ద గుళ్లు, గోపురాల్లో దర్శనాలు నియంత్రించామని అన్నారు. వాణిజ్య సముదాయాలన్నీ మూసేయించామని చెప్పారు. అవి ఈ నెల 31 వరకు మూసే ఉంటాయని ఆయన వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా కరోనా భయంతో నియంత్రణ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు బోర్డర్లు మూసేశాయని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువులు పూర్తిగా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ప్రాణభయంతో ఏదో చేయాల్సిన పరిస్థితి లేదన్న ఆయన.. కుటుంబంలో అందరూ క్షేమంగా ఉండాలంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పారు. పిల్లలు, పెద్దలను ఇంటి బయటకు వెళ్ల వద్దని సూచిస్తున్నామని ఆయన అన్నారు.

మార్చి 31 వరకు ఇళ్లలోనే ఉండండి. ఎక్కడికీ వెళ్లకండి. మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారంతా బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన సూచించారు. వారు పొరపాటు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఏప్రిల్ 4న ప్రతి ఇంటికీ వచ్చి గ్రామ వలంటీర్ రేషన్‌తో పాటు కేజీ పప్పు, 1000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఆయన తెలిపారు.

Tags: corona, covid-19, andhra pradesh, ysrcp, ys jagan, ap government, app lock down

Advertisement

Next Story

Most Viewed