Israel : అక్టోబరు 7 వచ్చేసింది.. ఏ క్షణమైనా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి ?

దిశ, నేషనల్ బ్యూరో: సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడికి పాల్పడింది.

Update: 2024-10-06 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సరిగ్గా ఏడాది క్రితం అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడికి పాల్పడింది. ఈసారి అక్టోబరు 7న (సోమవారం) ఏం జరగబోతోంది ? గత మంగళవారం తమ దేశంపై మిస్సైళ్లతో దాడి చేసిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోబోతోందా ? అనే అంశంపై ఇప్పుడు అంతటా వాడివేడి చర్చ జరుగుతోంది. ఈతరుణంలో ఆదివారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉత్తర గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌పైకి హమాస్ మిలిటెంట్లు పెద్దసంఖ్యలో రాకెట్లను సంధించారు. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ వాటిని గాల్లోనే అడ్డుకొని కూల్చేసింది.

ఇరాన్ సుప్రీం లీడర్ ట్వీట్లు

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్స్ వేదికగా పలు ట్వీట్లు చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించే ముస్లిం దేశాలనూ తాము వదలబోమని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యెమన్ దాకా, ఇరాన్ నుంచి లెబనాన్ దాకా ఇస్లామిక్ దేశాల స్వాతంత్య్రాన్ని పరిరక్షించేందుకు తమ వంతు సాయాన్ని తప్పక అందిస్తామని ఖమేనీ వెల్లడించారు. పాలస్తీనా, లెబనాన్, ఇరాక్, సిరియా, యెమన్ ప్రజల శత్రువులే ఇరాన్ శత్రువులని ఆయన తెలిపారు.

అమీర్ అలీ హాజీజాదేను సత్కరించిన ఖమేనీ

ఇజ్రాయెల్‌పై మిస్సైల్ దాడులను గత మంగళవారం విజయవంతంగా పూర్తిచేసినందుకుగానూ ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ కమాండర్‌‌ 62 ఏళ్ల అమీర్ అలీ హాజీజాదేను ‘ఆర్డర్ ఆఫ్ ఫథ్’తో సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఆదివారం సత్కరించారు. 2009 సంవత్సరం నుంచి ఇరాన్ వాయుసేనను అమీర్ అలీ హాజీజాదే లీడ్ చేస్తున్నారు.

విమాన రాకపోకలు నిలిపివేసిన ఇరాన్

ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ప్రతీకార దాడికి దిగొచ్చనే అంచనాల నేపథ్యంలో ఇరాన్ హైఅలర్ట్ మోడ్‌పై ఉంది. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి తమ దేశం నుంచి అన్ని విమానాల రాకపోకలను ఆపేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విమాన సర్వీసులు నడవవని స్పష్టం చేసింది.

వారంలో 440 మంది హిజ్బుల్లా మిలిటెంట్లను మట్టికరిపించాం : ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గెలెంట్ ఆదివారం ఉదయం కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రువుల దాడిని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు శత్రు లక్ష్యాలపై దాడి చేయడంలో ఇజ్రాయెల్‌ చాలా శక్తివంతమైందని ఆయన చెప్పారు. తమ శక్తి గురించి తెలియాలంటే గాజా, బీరుట్‌లను ఒకసారి చూడాలని యోవ్ గెలెంట్ సూచించారు. సెప్టెంబరు 30 నుంచి లెబనాన్‌పై జరుపుతున్న దాడుల్లో 440 మందికిపైగా హిజ్బుల్లా మిలిటెంట్లను మట్టుబెట్టామని ఆయన చెప్పారు. హిజ్బుల్లా దాడుల వల్ల గత ఏడాది వ్యవధిలో లక్షలాది మంది ఇజ్రాయెలీలు లెబనాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి వలస వెళ్లారని, వారిని తిరిగి ఆయాచోట్లకు చేర్చేందుకే ఈ సైనిక ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్‌లోని బీర్షేబా పట్టణంలో ఉన్న సెంట్రల్ బస్ స్టేషన్ వద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, 10 మందికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు. సదరు ఉగ్రవాది కత్తులు, తుపాకులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నించాడని చెప్పారు.

ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ హతం!

లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ హతమైనట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా మిలిటెంట్లకు సైనిక వ్యూహరచనతో ముడిపడిన సహాయ సహకారాలను అందించేందుకు వారం క్రితమే ఆయనను ఇరాన్ ప్రభుత్వం లెబనాన్‌కు పంపింది. ఇజ్రాయెల్‌ ఫైటర్‌ జెట్లు చేసిన దాడిలో ఇస్మాయిల్ ఖానీ చనిపోయారని ఐఆర్‌జీసీ వర్గాలు వెల్లడించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 2020లో అమెరికా దళాలు అప్పటి ఐఆర్‌జీసీ ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఖాసిం సులేమానీపై డ్రోన్‌ దాడి చేసి చంపింది. దీంతో ఆయన స్థానంలో ఇస్మాయిల్ ఖానీ బాధ్యతలు చేపట్టారు.


Similar News