Bangladesh: బంగ్లాదేశ్ లో చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్

ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన చిన్మయి కృష్ణదాస్‌ బ్రహ్మచారి (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్‌ (Bangladesh)లో అరెస్టు అయ్యారు.

Update: 2024-11-26 10:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన చిన్మయి కృష్ణదాస్‌ బ్రహ్మచారి (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్‌ (Bangladesh)లో అరెస్టు అయ్యారు. చిన్మయి కృష్ణదాస్ అరెస్టు, బెయిల్ నిరాకరణపై భారత విదేశాంగ శాఖ(MEA) ఆందోళన వ్యక్తం చేసింది. ఢాకాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందువులు, మైనార్టీలపై దాడులు సరికాదని తెలిపింది. వారికి భద్రత కల్పించాలని బంగ్లాదేశ్‌ అధికారులను కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్‌ జైస్వాల్‌ తెలిపారు. బంగ్లాలో తీవ్రవాద గ్రూపులు ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపుల దాడులకు తెగబడుతున్నాయని.. ఇప్పుడు చిన్మయిని అరెస్టు చేయడం దారుణని అన్నారు. మైనార్టీల ఇళ్లలో దోపిడీ, వ్యాపార సంస్థల్లో విధ్వంసం, దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్‌ల కోసం పనిచేస్తున్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని పేర్కొంది.

కేంద్రానికి ఇస్కాన్ వినతి

మరోవైపు, కృష్ణదాస్‌ బ్రహ్మచారి అరెస్టు విషయంలో జోక్యం చేసుకొని, ఆయన్ను విడిపించాలని ఇస్కాన్‌ ఆలయ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘ఇస్కాన్‌కు చెందిన కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లోని ఢాకా పోలీసులు అరెస్టు చేశారనే వార్తలను మేము చూశాం. అక్కడి అధికారులు ఇస్కాన్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మాది శాంతి, ప్రేమతో కూడిన భక్తి ఉద్యమం. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని ఢాకా ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఇస్కాన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఇకపోతే, చిన్మయి కృష్ణదాస్ గతనెలలో అక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అప్పుడు బంగ్లా జాతీయ జెండాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన్ని ఢాకాఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు.

Tags:    

Similar News