కీలక బిల్లులు ప్రవేశపెట్టిన స్టాలిన్ 'సర్కార్.. లైంగిక దాడుల్లో అమలు చేయనున్న కఠిన శిక్షలు ఇవే..!
మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక దాడుల్లో నిందితులకు శిక్షలు మరింత కఠినతరం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక దాడుల్లో నిందితులకు శిక్షలు మరింత కఠినతరం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో రెండు కీలక బిల్లులను సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రవేశపెట్టారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టినట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేసి, ఇలాంటి నేరాలను కట్టడి చేయాలన్నదే తమ లక్ష్యమని స్టాలిన్ తెలిపారు. మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత 2023లో పేర్కొన్న చట్టంతో ఉన్న శిక్షలను మరింతగా పెంచనున్నారు. అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లో పేర్కొన్న బెయిల్ సంబంధిత నియమ, నిబంధనల్లో కఠినమైన మార్పులు చేశారు.
భారతీయ న్యాయ సంహిత 2023లోని సెంట్రల్ యాక్ట్ 48కు తమిళనాడు ప్రభుత్వం సవరణలు చేసింది. దీంతో పాటు తమిళనాడు మహిళా వేధింపుల నిరోధక చట్టం 1998లో కూడా మార్పులు చేసింది. ఇకపై డిజిటల్ మాధ్యంమలో.. అంటే ఇంటర్నెట్, ఫోన్, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా మహిళలపై జరిగే వేధింపులను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. గతంలో కేవలం ప్రత్యక్షంగా జరిగే వేధింపులు, దాడులకు మాత్రమే ఈ చట్టం వర్తించింది. కానీ ఇకపై డిజిటల్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా జరిగే వేధింపులకు కూడా చట్టంలో చేర్చారు. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ఆమోదం పొందే అవకాశం ఉంది.