మరోసారి అత్యంత వేగవంతమైన ఆర్థికవ్యవస్థగా భారత్: ఐరాస
భారత్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్థికవ్యవస్థగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అర్థికవ్యవస్థగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. 2025లో కీలకమైన ప్రైవేట్ వినియోగం, పెట్టుబడుల మద్దతుతో భారత జీడీపీ 6.6 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. వరల్డ్ ఎకనామిక్ సిట్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌తో పాటు దక్షిణాసియా మొత్తం ఆర్థిక వృద్ధి ఈ ఏడాదిలో పటిష్ఠంగా ఉంటుంది. 2026లో భారత జీడీపీ 6.8 శాతానికి స్వల్పంగా పెరుగుతుంది. సేవల రంగంతో పాటు ప్రధాన ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఎగుమతుల వృద్ధి భారత్‌కు కలిసి రానుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మూలధన వ్యయం ద్వారా రాబోయే సంవత్సరాల్లో వృద్ధి ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని, సరఫరా, తయారీ, సేవల రంగాలు ప్రధానంగా వృద్ధిని మరింత వేగవంతంగా కొనసాగిస్తాయని ఐక్యరాజ్యసమితి గ్లోబల్ ఎకనమిక్ మానిటర్ హెడ్ హమీద్ రషీద్ చెప్పారు. ఇదే సమయంలో దేశంలోని వ్యవసాయం రంగం కూడా వృద్ధిలో కీలకంగా ఉంటుందని, 2024లో రుతుపవనాలు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని ప్రధాన పంటల సాగుకు కలిసొచ్చింది. తద్వారా 2025లో వ్యవసాయ ఉత్పాదక అంచనాలను పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, మొత్తం ప్రపంచ వృద్ధి రేటు 2.8 శాతం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గి 1.6 శాతానికి పడిపోవచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.