Pakistan: పాకిస్థాన్ లో ఆందోళనలు.. ఐదుగురు మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు నిరసనలు చేపట్టారు.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం పెద్దఎత్తున భద్రత బలగాలను మోహరించింది. ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్న పోలీసులపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. దీంతో, ఐదుగురు చనిపోయారు. మరణించిన వారిలో నలుగురు భద్రతా సిబ్బంది ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు చేసిన దాడిలో 119మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని తెలిపారు. నిరసనల దృష్ట్యా ఆర్టికల్ 245 ప్రకారం సైన్యం మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆందోళన నేపథ్యంలో పాక్ సైన్యం షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో ఆదివారం మొదలైన నిరసన ప్రదర్శన సోమవారం సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వచ్చాకే మేము ఇంటికి వెళ్తామంటూ ఆయన భార్య బుష్రా బీబీ భద్రతా దళాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన రహదారులను మూసివేసింది. ఆయా నగరాలకు వెళ్లే రైళ్లు, మెట్రో బస్సుల సర్వీసులను నిలిపివేసింది. అలానే, ఇస్లామాబాద్ చుట్టూ ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించుకుంటూ నిరసనకారులు రాజధానిలోకి ప్రవేశిస్తున్నారు. అడ్డుకున్న పోలీసులపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇమ్రాన్ మద్దతుదారుల నిరసనలు
ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ఉద్యమ ప్రతినిధి జుల్ఫీ బుఖారీ మాట్లాడుతూ.. అధికారులు నిరసనకారులను ఎదుర్కోవడంతో కవాతులో ఒకరు మరణించారని తెలిపారు. మరో 20 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. గతంలో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ- ఇన్సాఫ్ పార్టీ (PTI) నేతృత్వంలో చేపట్టిన నిరసన ప్రదర్శనల సందర్భంగా పబ్లిక్ ఆర్డర్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఇస్లామాబాద్‌లోని అబ్బారా పోలీస్‌స్టేషన్‌లో ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు నేతలపై 2022 ఆగస్టు 20న కేసు నమోదైంది. అయితే, వారిపై పోలీసులు మోపిన అభియోగాలను జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ యాసిర్ మహమూద్ కొట్టివేశారు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దయినప్పటి నుంచి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ మద్దతుదారులు ఆదివారం భారీ నిరసనలు ప్రారంభించారు. దీంతో, ఆందోళనలు పెరిగిపోయాయి.