Constitution Day: పార్లమెంటు పాత భవనంలో రాజ్యాంగ దినోత్సవాలు
దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్(ice President Jagdeep Dhankhar), ప్రధాని నరేంద్ర మోడీ(, Prime Minister Narendra Modi), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) సహా లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే రాష్ట్రపతి ప్రసంగించారు. “75 ఏళ్ల క్రితం ఇదేరోజున రాజ్యాంగం ఆమోదం పొందింది. ఇది మన పవిత్ర గ్రంథం. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపర్చారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలి’’ అని ముర్ము గుర్తుచేశారు.
స్మారక నాణెం, స్టాంపు విడుదల
ఇలాంటి వేడుకలు మనల్ని ముందుకు నడిపించేందుకు అవకాశం కల్పిస్తాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. జాతీయ లక్ష్యాలను సాధించడంలో అందరం కలిసే ఉన్నామని నిరూపించామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ముర్ము ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బలహీనవర్గాలకు, పేదలకు శాశ్వత ఇళ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. దేశంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచడం దానిని పాలించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారని ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. డా. రాజేంద్రప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా దేశం నడుస్తోందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, స్టాంపుని విడుదల చేశారు. అలానే రాజ్యాంగం గురించి రాసిన రెండు పుస్తకాలను విడుదల చేశారు.