China-America: ట్రంప్ ప్రకటనపై చైనా ఆగ్రహం.. వాణిజ్య యుద్ధం వల్ల ఒరిగేదీ ఏమీ లేదని ప్రకటన

అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దిగుమతి సుంకాలపై(Import Tariffs) కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ప్రకటనపై చైనా(China) స్పందించింది.

Update: 2024-11-26 09:33 GMT

దిశ, బిజినెస్: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దిగుమతి సుంకాలపై(Import Tariffs) కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ప్రకటనపై చైనా(China) స్పందించింది. వాణిజ్య యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని అమెరికాలోని చైనా దౌత్యకార్యాలయం అధికార ప్రతినిధి లియు పెంగ్యూ అన్నారు. ‘‘ అమెరికా- చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఇరుదేశాలకు పరస్పరం మేలు చేస్తాయని మేం నమ్ముతున్నాం. వాణిజ్య యుద్ధానికి దిగితే మాత్రం ఎవరికీ ఉపయోగం ఉండదు’’ అని అన్నారు. తన ఆర్థిక అజెండాలో కీలకమైన దిగుమతి సుంకాల గురించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. జనవరి 20న తన మొదటి ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లలో ఒకటిగా.. మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించడానికి అవసరమైన పత్రాలపై సంతకం చేస్తానని అన్నారు. అలానే చైనా దిగుమతులపై10 శాతం సుంకం విధిస్తామన్నారు.

డ్రగ్స్ సరఫరాకు వ్యతిరేకంగానే..

చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ తెలిపారు. ఇకపోతే, 2019లో కొందరు అమెరికా అధికారులు ఈ డ్రగ్‌ను సామూహిక విధ్వంసక ఆయుధంగా గుర్తించాలని కోరినట్లు న్యూయార్క్‌ పోస్టు కొన్ని నెలల కిందట ప్రచురించిన కథనంలో పేర్కొంది. ఆరోగ్య సమస్యల్లో నొప్పి నివారిణిగా వినియోగించే ఫెంటనిల్‌ను గతంలో ఆస్పత్రుల బయట వాడేవారు కాదు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా వాడుతున్నారు. మెక్సికోలోని క్రిమినల్‌ గ్యాంగ్‌లు ఆ డ్రగ్ ని వాడుతున్నారు. ఆ డ్రగ్ ని చైనాలో చాలా తక్కువకు తయారు చేసి వివిధ మార్గాల్లో అమెరికాకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో చైనాతో చర్చలు జరిపామని.. కానీ దాని వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నారు. చైనా నుంచి వచ్చే వాటిని ఆపేవరకు అక్కడినుంచి వచ్చే ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తామని తెలిపారు. ట్రంప్ పోస్టుని షేర్ చేస్తూ.. ఫెంటనిల్ ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉందని టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News