Tata Neu: రిటైల్ పెట్టుబడుల విభాగంలోకి అడుగుపెట్టిన టాటా డిజిటల్
కస్టమర్లు సేవింగ్స్ ఖాతా అవసరం లేకుండా 9.1 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా డిజిటల్ రిటైల్ పెట్టుబడుల విభాగంలోకి అడుగుపెట్టింది. సంస్థకు చెందిన సూపర్ యాప్ 'టాటా న్యూ'లో ఫిక్స్‌డ్ డిపాజిట్లో మదుపు చెసే సదుపాయాన్ని ప్రారంభించింది. కస్టమర్లు సేవింగ్స్ ఖాతా అవసరం లేకుండా 9.1 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు నమ్మకమైన, అధిక రాబడి, ఫిక్స్‌డ్ రిటర్న్‌లను అందించాలనే లక్ష్యంతో రిటైల్ పెట్టుబడుల విభాగంలోకి అడుగుపెట్టామని పేర్కొంది. సరళమైన, సురక్షితమైన ప్లాట్‌ఫామ్ నుంచి మార్కెట్లో ఉన్న పోటీ ఆధారంగా ఎక్కువ వడ్డీని అందేలా ఎఫ్‌డీ అందుబాటులో ఉందని, కొత్తగా మదుపు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని టాటా డిజిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గౌరవ్ హజ్రతి చెప్పారు. వినియోగదారులు కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచే మదుపు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) ద్వారా రూ. 5 లక్షల బీమా రక్షణ ఉంటుందని కంపెనీ పేర్కొంది.