IT Department: ప్రత్యక్ష పన్ను బకాయిల్లో 67 శాతం వసూలు చేయడం కష్టమే: ఐటీ శాఖ
వాటిని రద్దు చేయాలని లేదా మారటోరియంలు విధించాలని కమిటీ సిఫార్సు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రత్యక్ష పన్ను బకాయిలకు సంబంధించి రూ. 43 లక్షల కోట్లలో మూడింట రెండు వంతుల మొత్తాన్ని వసూలు చేయడం కష్టమని ఆదాయపు పన్ను శాఖ పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలియజేసింది. ఈ సందర్భంగా భారీ మొండి బకాయిలు ఉండటంపై ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని రద్దు చేయాలని లేదా మారటోరియంలు విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఛైర్మన్ ప్యానెల్‌కు వివరిస్తూ.. ఫిబ్రవరి 14 నాటికి ప్రత్యక్ష పన్నుల బకాయిలు మొత్తం దాదాపు రూ. 43,07,201 కోట్లు ఉన్నాయి. అందులో 67 శాతానికి సమానమైన రూ.28,95,851 కోట్లు వసూలు చేయడం కష్టమని పేర్కొన్నారు. ఇంత భారీ మొండి బకాయిల డిమాండ్ ఆందోళన కలిగిస్తుంది. ఇది వారసత్వ సమస్య. ఈ బకాయిల్లో 1990ల మధ్య కాలానికి చెందినవి కూడా ఉన్నాయి. ఈ మొత్తం కూడా స్పష్టంగా లేదని చెప్పారు. 1990లకు ముందు రికార్డులను మాన్యూవల్‌గా నమోదు చేసేవారు. రిజిస్టర్లను డిజిటలైజ్ చేసే ప్రక్రియ 2010-11 సమయంలో ప్రారంభమైంది. అందులోనూ కొంత మాన్యువల్, కొంత డిజిటలైజ్ జరిగింది. అంతకుముందు ఉన్న డేటాలో పాన్ కార్డు వివరాలు స్పష్టంగా లేవని వివరించారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి రూ.10,55,906 కోట్ల పన్ను బకాయిలు 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి.