10 ఏళ్లలో రెట్టింపైన జీడీపీ
పదేళ్లలో 50 శాతం కంటే ఎక్కువ జీడీపీ అభివృద్ధిని నమోదు చేసిన దేశాల్లో రష్యా (57 శాతం), ఆస్ట్రేలియా (58 శాతం), స్పెయిన్ (50 శాతం) ఉన్నాయి.

- 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లు
- ప్రస్తుతం 4.3 ట్రిలియన్ డార్లు
- త్వరలో జపాన్‌ను క్రాస్ చెయ్యొచ్చు
- వెల్లడించిన ఐఎంఎఫ్
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా జీడీపీ పదేళ్లలో రెట్టింపు అయ్యింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత్ జీడీపీ.. 2025లో 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) డేటాలో వెల్లడించింది. భారత జీడీపీ 10 ఏళ్లలో 105 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలోఅమెరికా 66 శాతం, చైనా 44 శాతం మేర జీడీపీని పెంచుకున్నాయి. జీడీపీ పరంగా ఇండియా ప్రస్తుతం 5వ అతిపెద్ద దేశంగా ఉంది. అమెరికా 30.3 ట్రిలియన్ డాలర్లు, చైనా 19.5 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ 4.9 ట్రిలియన్ డాలర్లు, జపాన్ 4.4 ట్రిలియన్ డాలర్లతో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో జపాన్ జీడీపీలో ఏ మాత్రం పెరుగుదల లేవు. ఈ నేపథ్యంలో త్వరలో జపాన్‌ను భారత్ అధిగమించే అవకాశం ఉన్నట్లు ఐఎంఎప్ అంచనా వేస్తోంది. గత దశాబ్ద కాలంలో యూకే జీడీపీ 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫ్రాన్స్ 38 శాతం వృద్ధితో 3.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
పదేళ్లలో 50 శాతం కంటే ఎక్కువ జీడీపీ అభివృద్ధిని నమోదు చేసిన దేశాల్లో రష్యా (57 శాతం), ఆస్ట్రేలియా (58 శాతం), స్పెయిన్ (50 శాతం) ఉన్నాయి. కాగా, దేశ జీడీపీ వృద్ధిని చూపిస్తున్న ఐఎంఎఫ్ డేటాను బీజేపీ మంత్రి అమిత్ మాల్వియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇండియా ఒక అద్భుతమైన ఆర్థిక మైలు రాయిని సాధించింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లు నుంచి ప్రస్తుతం 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. ఇది ఏ ఇతర ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా సాధ్యం కాని అభివృద్ధిగా మాల్వియా అభివర్ణించారు. ఈ అసాధారణ విజయం ప్రధాని మోడీ నిర్ణయాత్మక నాయకత్వానికి కొలమానమని, ఆయన ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి నిదర్శనమని మాల్వియా ప్రశంసించారు. చురుకైన ఆర్థిక విధానాలు, సాహసోపేతమైన సంస్కరణలు, వ్యాపారాన్ని సులభంగా కొనసాగించడానికి తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని అన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాని రికార్డుగా మాల్వియా అభివర్ణించారు.