UPI : ఏప్రిల్ 1 నుంచి UPI సేవలు బంద్
యూపీఐ(UPI) వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది.

దిశ, వెబ్ డెస్క్ : యూపీఐ(UPI) వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుండి అన్ని రకాల యూపీఐ సేవలు బంద్ కాబోతున్నాయి. యూపీఐ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను నియంత్రించేందుకు ఎన్‌పీసీఐ(NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి, యాక్టివ్‌గా లేని లేదా కొత్తగా తీసుకున్న మొబైల్ నంబర్‌లతో లింక్ అయిన యూపీఐ ఖాతాలు పని చేయవని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి బ్యాంకులు, ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ సంస్థలకు ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ లావాదేవీల్లో అంతరాయం రాకుండా ఉండేందుకు, వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవాలని సూచించింది. యూపీఐకి లింక్ అయి, వినియోగంలో లేని లేదా మార్చిన నంబర్‌ల ఖాతాలు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండటం వల్ల సైబర్ మోసగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇనాక్టివ్ నంబర్‌లను డీ-లింక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేసింది. ఎన్‌పీసీఐ ఆదేశాల మేరకు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లు, బ్యాంకులు ఇనాక్టివ్ నంబర్‌లను తొలగించనున్నాయి. అయితే ఇది మొబైల్ నంబర్ మార్చినప్పటికీ బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయని వారిపై ప్రభావం పడనుంది. అలాగే యూపీఐకి లింక్ చేసిన నంబర్‌ను కాల్స్, ఎస్సెమ్మెస్‌ల కోసం ఉపయోగించకుండా చాలా కాలం పాటు పక్కన పెట్టిన వారికి, పాత నంబర్ వేరొకరికి అసైన్ అయి ఉంటే కూడా ఈ ఎఫెక్ట్ పడనుంది.