India-China: చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాలను విధించిన కేంద్రం
అల్యూమినియం ఫాయిల్‌పై టన్నుకు రూ. 75 వేలు యాంటీ-డంపింగ్ సుంకం విధిస్తున్నట్టు కస్టమ్స్ విభాగం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ తయారీ రంగాన్ని రక్షించేందుకు, చౌక దిగుమతుల నుంచి స్థానిక వ్యాపారులను కాపాడేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. తాజాగా, తక్కువ ధరకు దిగుమతి అవుతున్న నాలుగు రకాల చైనా ఉత్పత్తులపై ప్రభుత్వం యంటీ-డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్టు వెల్లడించింది. డ్రాగన్ దేశం నుంచి చౌకగా దేశీయ మార్కెట్లోకి వస్తున్న సాఫ్ట్ ఫెర్రైట్ కోర్స్, వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్‌లు, అల్యూమినియం ఫాయిల్, ట్రైక్లోరో ఐసోసైన్యూరిక్ యాసిడ్ (నీటి శుద్ధిలో ఉపయోగించే రసాయనం) దిగుమతులపై సుంకాలు వర్తిస్తాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. సాఫ్ట్ ఫెర్రైట్ కోర్స్, వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్‌లు, ట్రైక్లోరో ఐసోసైన్యూరిక్ యాసిడ్‌లపై సుంకాలు వచ్చే ఐదేళ్ల పాటు అమల్లో ఉంటాయని, అల్యూమినియం ఫాయిల్‌పై టన్నుకు 873 డాలర్లు(రూ. 75 వేలు) యాంటీ-డంపింగ్ సుంకం విధిస్తున్నట్టు కస్టమ్స్ విభాగం నోటిఫికేషన్‌లో పేర్కొంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నిర్వహించిన సమీక్ష ఆధారంగా ఈ ఉత్పత్తులు తక్కువ ధరలకు భారతీయ మార్కెట్లోకి డంప్ అవుతున్నాయని గుర్తించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్లకు చేరుకున్న చైనాతో అధిక వాణిజ్య లోటును పరిష్కరించడానికి భారత ప్రభుత్వం తరచుగా యాంటీ డంపింగ్ డ్యూటీ చర్యలను తీసుకుంటోంది. రెండు దేశాలు డబ్ల్యూటీఓ సభ్యులు అయినప్పటికీ.. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఉన్న లోపాలపై భారత ప్రభుత్వం పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది చైనాకు అనుకూలంగా ఉందని చెబుతోంది.