OpenAI CEO: పదేళ్లపాటు వేధించాడు.. ఓపెన్ ఏఐ సీఈవోపై సోదరి సంచలన ఆరోపణలు

ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌(OpenAI CEO Sam Altman) పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

Update: 2025-01-08 06:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌(OpenAI CEO Sam Altman) పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాదాపు పదేళ్లపాటు సామ్ ఆల్ట్ మన్ తనను లైంగికంగా వేధించినట్లు(Sexual Harassment Allegations) ఆయన సోదరి ఆరోపించారు. ఈ మేరకు మిస్సోరీ డిస్ట్రిక్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటినుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మిస్సోరీలోని క్లేటన్‌లోని మా ఇంట్లో నాకు వేధింపులు ఎదురయ్యాయి. నాకు మూడేళ్లున్నప్పుడు.. సామ్ కు పన్నెండేళ్లు. అప్పటి నుంచే వేధింపులు ఎదుర్కొన్నారు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాలాసార్లు వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణాల వల్ల నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్‌ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో’’ అని సామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ (Sam Altman)పై ఆమె గతంలోనూ ఓసారి ‘ఎక్స్‌’ వేదికగా ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఈసారి మాత్రం కోర్టును ఆశ్రయించారు. దీంతో సామ్ ఆల్ట్ మన్ విచారణను ఎదుర్కోవాల్సిందే.

ఆరోపణలపై స్పందించిన సామ్ కుటుంబం

అయితే, వేధింపుల ఆరోపణలను ఖండిస్తూ సామ్ ఆల్ట్‌మన్‌ (Sam Altman), ఆయన తల్లి, సోదరులు సంయుక్తంగా ప్రకటన రిలీజ్ చేశారు. సామ్ సోదరి మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించారు. ‘‘ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం. ఆమెకు అండగా ఉండేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నే ఉన్నాం. ఆర్థికంగా సాయం చేసినప్పటికీ.. ఇంకా డబ్బుకోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా ఫ్యామిలీపై, ముఖ్యంగా సామ్ పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. ఆ ఆరోపణలను మమ్మల్ని చాలా బాధపెట్టాయి. తండ్రి ఆస్తిని అక్రమంగా ఆక్రమించి సొంత కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దారుణంగా సామ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెబుతోంది. ఇవన్నీ అవాస్తవం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబగోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఆమె వ్యక్తిగత గోప్యతపై దృష్ట్యా మేం దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది’’ అని సామ్‌ కుటుంబం ప్రకటనలో పేర్కొంది.

Tags:    

Similar News