Adani: ఛార్జిషీటులో ఎక్కడా అదానీ పేరు లేదు.. మాజీ ఏజీ ముకుల్ రోహత్గీ వ్యాఖ్యలు
అదానీపై(Adani) అమెరికా కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ(Mukul Rohatgi) సంచలనాలు బయటపెట్టారు.
దిశ, నేషనల్ బ్యూరో: అదానీపై(Adani) అమెరికా కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ(Mukul Rohatgi) సంచలనాలు బయటపెట్టారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన ఆరోపణల్లో ఎక్కడా గౌతమ్ అదానీ(Gautam Adani), సాగర్ అదానీ పేర్లు ప్రస్తావించలేదన్నారు. అదానీ వ్యవహారంలో అమెరికా కోర్టులో(US Department of Justice indictment) వేసిన చార్జ్‌షీట్‌లో లంచాల అంశంపై కూడా స్పష్టత లేదన్నారు. ఎవరికి ఎవరు లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. భారత అధికారులకు లంచాలు ఇచ్చారని ప్రస్తావించారు కానీ.. వారి పేర్లు, హోదాపై ఎక్కడా చెప్పలేదు. ‘నేనేం అదానీ గ్రూప్ తరఫున ప్రతినిధిగా మాట్లాడడం లేదు. నేనొక లాయర్‌ని. అమెరికా కోర్టు నేరారోపణను నేను పరిశీలించా. అందులో ఐదు అభియోగాల్లో.. ఒకటి, ఐదో అంశాలు కీలకంగా ఉన్నాయి. వాటిల్లోనూ అదానీగానీ, ఆయన బంధువు సాగర్‌పై గానీ అభియోగాలు లేవు. మొదటి అభియోగంలో.. అదానీల తప్ప కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొందరు అధికారులు, ఒక విదేశీ వ్యక్తి పేరుంది. అలాగే.. కీలక ఆరోపణల్లోనూ అదానీ పేరు లేదు’ అని రోహత్గీ చెప్పారు.
అదానీపై ఇతర ఆరోపణలు
సెక్యూరిటీలు, బాండ్‌లకు సంబంధించిన గణనల్లో అదానీలు సహా ఇతరుల పేర్లు ఉన్నాయని రోహత్గీ చెప్పారు. ఆరోపణలు చేసే సమయంలో అధికారులు ఏ శాఖకు చెందిన వారు, వారి పేర్లు ఏంటన్నది కచ్చితంగా ఛార్జ్‌షీట్‌లో ఉండాలన్నారు. అదానీపై మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. పేర్లు లేకుండా ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలు మాత్రమే చేయడం షాకింగ్ ఉందన్నారు. అదానీ దీనిపై న్యాయపోరాటం చేస్తారని భావిస్తున్నా అని అన్నారు. అలానే వారికి నచ్చినట్లుగానే స్టాక్ ఎక్ఛేంజీలపై స్పందిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు.