Venezuela : వెనిజులాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం..దాదాపు 24 రాష్ట్రాల్లో చీకటి..!

దక్షిణ అమెరికా దేశం వెనిజులా ఎప్పుడూ ఎదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

Update: 2024-08-30 21:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ అమెరికా దేశం వెనిజులా ఎప్పుడూ ఎదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కాగా 2019 నుంచి ఆ దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఆ దేశం అత్యంత దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుంది. రోజుకు సగటున 5 వేల మంది ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ రోజున్న ధరలు రేపు ఉండటంలేదు. ప్రతి 19 రోజులకు ఒకసారి ధరలు రెట్టింపవుతున్నాయి.  గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఆ దేశం తాజాగా మరో సమస్యతో వార్తల్లో నిలిచింది.వివరాల్లోకి వెళ్తే.. వెనిజులా గత కొన్ని రోజులుగా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలోని దాదాపు 24 రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజామున నుంచి విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది.రాజధాని కారాకస్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో కరెంటు సమస్య తలెత్తింది. ఉదయం 4.50 నుంచి దేశంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని.. ఇది విధ్వంసకారుల చర్యేనని అధ్యక్షుడు నికోలస్‌ మడురో పేర్కొన్నారు.

అధ్యక్షుడు నికోలస్‌ మడురో లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారని, దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య తలెత్తిందని సమాచారశాఖ మంత్రి ఫ్రెడీ నానెజ్‌ పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని, దేశ ప్రజల శాంతి, సామరస్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరని ఫ్రెడీ నానెజ్‌ తెలిపారు . కాగా విద్యుత్ సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సెల్‌ఫోన్ సేవ లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయలేక పోతున్నామని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. 


Similar News