Israel-Lebanon: హెజ్‌బొల్లాపై భీకర దాడులకు పాల్పడ్డ ఇజ్రాయెల్.. వెయ్యి రాకెట్లు ధ్వంసం
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లెబనాన్ (Lebanon)లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో (Pagers and Walkie-Talkies Blasts) యుద్ధవాతావరణం ఏర్పడింది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లెబనాన్ (Lebanon)లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో (Pagers and Walkie-Talkies Blasts) యుద్ధవాతావరణం ఏర్పడింది. హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ (Israel) దళాలు దాడులతో విరుచుకుపడుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు(IDF) వైమానిక దాడులకు దిగింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు దాదాపు వంద రాకెట్ లాంఛర్లలో ఉన్న వెయ్యి రాకెట్లను చేసినట్లు ఐడీఎఫ్ (IDF) వెల్లడించింది. ఈ రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసేందుకు సిద్ధం చేయగా.. వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపింది. హెజ్‌బొల్లా (Hezbollah) సభ్యులకు చెందిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల ఘటనపై ఆ సంస్థ అధిపతి హసన్ నస్రల్లా ప్రసంగించారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో ఇజ్రాయెల్ హద్దు మీరిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అయితే, నస్రల్లా ప్రసంగిస్తున్న సమయంలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడటం గమనార్హం.
అలెర్ట్ అయిన అమెరికా
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలతో దాదాపు ఏడాదిగా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లెబనాన్ ను కూడా ఈ భయం పట్టుకుంది. దీంతో అమెరికా (USA) అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో ఏడాది నుంచే అమెరికా తమ సైన్యాన్ని మోహరించింది. ప్రస్తుత దాడులతో మరింతగా అలెర్ట్ అయ్యింది. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్‌బొల్లా ప్రకటించడంతో.. యుద్ధ విమానాలు, నౌకలు, బలగాలతో సిద్ధమవుతోంది. మరోవైపు.. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్.. ఇకపై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో వాటిని తీసుకుపోవడాన్ని నిషేధించింది. అటు ఖతర్ ఎయిర్‌లైన్స్ కూడా దీనిపై ప్రకటన చేసింది. లెబనాన్ ఆదేశాలకు అనుగుణంగా బీరుట్ నుంచి రాకపోకలు సాగించే తమ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.