Air pollution: వాయుకాలుష్యం వల్ల ఏటా 15 లక్షల మంది మృతి
వాయు కాలుష్యం (Air Pollution) ప్రపంచానికి పెద్దసవాల్ గా మారింది.వేగంగా జరగుతున్న పారిశ్రామికీకరణతో పాటు కార్చిచ్చు (wildfire) కూడా గాలి కాలుష్యానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: వాయు కాలుష్యం (Air Pollution) ప్రపంచానికి పెద్దసవాల్ గా మారింది.వేగంగా జరగుతున్న పారిశ్రామికీకరణతో పాటు కార్చిచ్చు (wildfire) కూడా గాలి కాలుష్యానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వందల ఎకరాల్లో అడవులు దహనం అవుతుండటంతో పాటు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీని కారణంగా ఏటా 15 లక్షల మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ది లాన్సెట్ జర్నల్(The Lancet journal) చేసిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఇది ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్యం కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదిక తెలిపింది. 2000- 2019 మధ్య ఈ కార్చిచ్చు వల్ల ఏర్పిడిన గాలి కాలుష్యంతో ఏటా 4.5 లక్షల మంది గుండె జబ్బులతో, శ్వాస సంబంధిత సమస్యలతో మరో 2.2 లక్షల మంది చనిపోయినట్లు తెలిపింది.
పేద దేశాలకే ముప్పు
అంతర్జాతీయ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం.. అడవిలో చెలరేగే మంటలతో పాటు పంటలను తగలబెట్టడంతో గాలి కాలుష్యం (Air Pollution) తీవ్రతరమవుతోందంది. అయితే, గాలికాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో 90శాతం పేద, మధ్యతరహా ఆదాయం ఉండే దేశాల్లోనే జరగుతున్నాయని లాన్సెట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఒక్క ఆఫ్రికాలోనే 40 శాతం మరణాలు నమోదయ్యానయి పేర్కొంది. చైనా, కాంగో, భారత్, ఇండోనేషియా, నైజీరియాలలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాలుగా గుర్తించింది. రానున్న రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవలే, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అజర్‌బైజాన్ రాజధాని బాకు వేదికగా ఐక్యరాజ్యసమితి కాప్-29 చర్చలు జరిగాయి. ఈ చర్చల తర్వేత లాన్సెట్ జర్నల్ అధ్యయన నివేదిక విడుదల అయ్యింది. ఇక, ఇప్పటికే ఈక్వెడార్ జాతీయ అత్యయిక స్థితిని విధించింది. దక్షిణాన ఉన్న 10వేల హెక్టార్లు కార్చిచ్చు వల్ల దహనం అయ్యాయని పేర్కొంది.