Priyanka Gandhi : ఇందిరాను తలపించేలా... ప్రియాంక గాంధీ పార్లమెంటు ఎంట్రీ
Priyanka Gandhi's Parliament entry reminds me of Indira Gandhi
దిశ, వెబ్ డెస్క్: వయనాడ్ ఎంపీగా గెలిచి తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) తన నాయనమ్మ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ(Grandmother was the late Prime Minister Indira Gandhi)ని తలపించారు. ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ముఖాకృతి, హెయిర్ స్టైల్ లో తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీల రూపాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియాంకగాంధీ బంగారు వర్ణం అంచుతో కూడిన తెలుపు రంగు కేరళా చీర కట్టుతో అచ్చం ఇందిరాగాంధీని తలపించే ఆహార్యంతో పార్లమెంటుకు వచ్చారు. ప్రియాంక గాంధీని ముఖ ద్వారం వద్ద రాహుల్ తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసుకుని ముచ్చట తీర్చుకున్నారు. అనంతరం సోదరుడితో కలిసి ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. పోడియం వద్దకు వెళ్లిన ప్రియాంక.. ముందుగా తమ చేతిలో ఉన్న రాజ్యాంగ ప్రతిని చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక.. చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌తోపాటు.. ప్రియాంక పిల్లలు రైహాన్ వాద్రా, మిరయా వాద్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకాలం పార్టీ ప్రచారాలకే పరిమితమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి రికార్డు మెజార్టీ 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 3.64 ఓట్లతో రాహుల్ పేరుతో ఉన్న అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు.
ప్రియాంకపై కాంగ్రెస్ శ్రేణుల భారీ ఆశలు
దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీ ప్రభంజనంతో వరుసగా మూడు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగా, కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. సోనియాగాంధీ అస్వస్థత నేపథ్యంలో రాహుల్ గాంధీ సారధ్యంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ ఆశించిన విజయాలను అందుకోవడంలో రెండడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కి అన్న చందంగా మిగిలిపోతోంది. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినా కాంగ్రెస్ ఎంపీ సీట్ల సంఖ్యను గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సెంచరీ మార్క్ దాటించలేకపోగా..ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఆమెపై కాంగ్రెస్ శ్రేణులు భారీ అంచనాలే పెట్టుకున్నాయి. ఇందిరాగాంధీని తలపించే ప్రియాంక గాంధీ ఆమె తరహాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా మారాలని, దేశ రాజకీయాల్లో సోదరుడు రాహుల్ గాంధీకి బలిమిగా నిలవాలని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి.