అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కొవిడ్ పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన జలుబు, దగ్గు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వైట్‌‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Update: 2024-07-18 03:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన జలుబు, దగ్గు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వైట్‌‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. వైద్యుల సలహా మేరకు కొవిడ్ మందులు తీసుకుంటున్నారు. డెలావేర్‌లోని రెహోబోత్‌లోని తన ఇంటిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల లాస్‌వేగాస్‌లో జరిగిన మీటింగ్ తరువాత బైడెన్ అనారోగ్యంతో కల్పించడంతో వైద్యులు కొవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేకుండా అయింది.

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మాట్లాడుతూ, అధ్యక్షుడికి టీకాలు వేశాము. ఆయనకు తేలికపాటి కొవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఐసోలేషన్‌లో ఉన్నప్పటికి కూడా తన అన్ని విధులను పూర్తిగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఎన్నికలకు ప్రత్యర్థి తరఫున అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సమయంలో కొవిడ్ కారణంగా బైడెన్ కొద్ది రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

మరోవైపు బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పించాలని డిమాండ్స్ వస్తున్నాయి. ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారీస్‌ రేసులో ఉంటారని తెలుస్తుంది. బైడెన్ ఇప్పుడు ప్రచారానికి దూరంగా ఉండటం, ఇటీవల జరిగిన నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వార్షిక సదస్సులో కమలా గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె రానున్న రోజుల్లో అమెరికాకు ప్రెసిడెంట్ కావొచ్చు అని కమలా హ్యారీస్ పై బైడెన్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే, అధ్యక్ష పదవికి ఆమె పోటీ చేస్తారని, అదే విధంగా ప్రచార బాధ్యతను కూడా ఆమె తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన దాడి తరువాత ఆయనకు అక్కడి ప్రజల్లో మద్దతు పెరిగింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ప్రపంచదేశాల్లో ఉత్కంఠ నెలకొంది.


Similar News