గాజాలో తీవ్ర విషాదం: ఆహారం కోసం వెళ్లి 12 మంది మృతి!

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్ని విషయం తెలిసిందే. పాలస్తీనియన్లు నీరు, ఆహారం, నివాసాలు లేక అల్లాడుతున్నారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది నిర్వాసితులయ్యారు.

Update: 2024-03-27 06:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్ని విషయం తెలిసిందే. పాలస్తీనియన్లు నీరు, ఆహారం, నివాసాలు లేక అల్లాడుతున్నారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది నిర్వాసితులయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే గాజాలో మరో విషాదం జరిగింది. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అమెరికా జార విడిచిన ఆహార పొట్లాలను అందుకునేందుకు ప్రయత్నించి 12 మంది మరణించినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా గాజాకు సాయం పంపగా వాటిని పారాచూట్‌ల సాయంతో కిందకు జార విడిచారు. అయితే వాటిని అందుకునే క్రమంలో 12 మందిపై ప్యాకెట్లు పడటంతో వారు సముద్రంలో మునిగి పోయారు.

ఈ ఘటనపై అమెరికా స్పందించింది. గాజాలోకి గాలిలోకి జారవిడిచిన 18 బండిల్స్‌లో మూడు బండిల్స్ పారాచూట్‌లు పనిచేయక నీటిలో పడిపోయాయని పేర్కొంది. అయితే మరణాలను యూఎస్ ధ్రువీకరించలేదు. దానిపై ఎటువంటి సమాచారం లేదని వెల్లడించింది. మరోవైపు సహాయక సామాగ్రిని గాలిలోంచి పంపడం సరికాదని, ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలని పాలస్తీనా ప్రభుత్వం తెలిపింది. కాగా, గత కొన్ని రోజులుగా గాజా పౌరులను అమెరికా పారాచూట్ల సాయంతో మానవతా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల ప్రారంభంలోనూ గాజా సిటీకి పశ్చిమాన ఉన్న అల్ షాతి క్యాంప్‌లో ఎయిర్‌డ్రాప్డ్ సహాయ ప్యాకేజీలు మీద పడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Tags:    

Similar News