మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇవే..ఆ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే

ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ ఈ ఘనత దక్కించుకోవడం ఇది వరుసగా ఏడోసారి.

Update: 2024-03-20 04:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ ఈ ఘనత దక్కించుకోవడం ఇది వరుసగా ఏడోసారి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం..అత్యంత సంతోషకర దేశాల్లో ఫిన్లాండ్ అగ్ర స్థానంలో ఉండగా..రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్ లాండ్ ఉన్నాయి. మొత్తం 143 దేశాల్లో అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించగా అత్యంత చివరన తాలిబన్లు పాలిస్తున్న అప్ఘనిస్థాన్ ఉంది. ఇక ఈ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా ఈ జాబితాలో అమెరికా 23, జర్మనీ 24 స్థానాల్లో నిలిచాయి. టాప్ 20లో కువైట్(12), కోస్టారికా(13)లు చోటు దక్కించుకున్నాయి. హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. టాప్ 20లో వరుసగా ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్, కోస్టా రికా, కువైట్, ఆస్ట్రియా, కెనడా, బెల్జియం, ఐర్లాండ్, చెకియా, లిథువేనియా, బ్రిటన్‌లు ఉన్నాయి.

టాప్ 10 దేశాల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాలు మాత్రమే 15 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉండగా.. టాప్ 20 కెనడా, బ్రిటన్‌లు మాత్రమే 30 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జోర్డాన్‌లలో 2006-10 నుంచి హ్యాపినెస్‌లో తీవ్ర క్షీణత నమోదైనట్టు నివేదిక పేర్కొంది. సెర్బియా, బల్గేరియా లాట్వియా వంటి తూర్పు యూరోపియన్ దేశాలు పెరుగుదలను నమోదు చేశాయి. ఇక, భారత్ గతేడాది మాదిరిగానే 126వ స్థానంలో నిలిచింది. చైనా, నేపాల్, పాకిస్థాన్‌లు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. కాగా, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యం, స్వేచ్ఛ, అవినీతి, వ్యక్తుల జీవన స్థితుల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు.

ఫిన్లాండ్ ప్రజల సంతోషానికి కారణమిదే!

ఫిన్లాండ్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉండటానికి గల కారణాలను ఆదేశంలోని హెల్సంకీ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ జెన్నిఫర్ డీ పావోలా వెల్లడించారు. ఫిన్లాండ్ ప్రజలకు ప్రకృతితో దగ్గరి సంబంధం ఉంటుందని తెలిపారు. అంతేగాక ఆరోగ్య కరమైన పని విధానం కూడా ఉంటుందని చెప్పారు. ఇది జీవితంలో సంతృప్తిగా ఉండటానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవంతమైన జీవితం ఎలా కొనసాగించాలి అనే దానిపై ఫిన్ లాండ్ ప్రజలకు మెరుగైన అవగాహన ఉందన్నారు. ప్రజల్లో విశ్వాసం, స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి ఎంతో ఉందని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, తక్కువ అవినీతి కూడా ప్రజలు అత్యంత సంతోషంగా ఉండటానికి కారణమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News