వాయు కాలుష్య ప్రభావం..ప్రతి రోజూ 2000 మంది చిన్నారులు మృతి!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. పలు కారణాలతో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నది.

Update: 2024-06-20 03:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. పలు కారణాలతో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నది. అంతేగాక మానవుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్యం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నింటిలో ఈ సమస్యపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ తాజాగా జరిపిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

వాయు కాలుష్య ప్రభావంతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 2,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. అంతేగాక అత్యధికంగా మరణాలకు కారణమవుతున్న విషయంలో వాయుకాలుష్యం రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బీపీ ఉండగా..ఆ తర్వాత స్థానంలో పొగాకు వినియోగం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 2021లో వాయు కాలుష్యం వల్ల 8.1మిలియన్ల మంది మరణించారని తెలిపింది. మొత్తం మరణాల్లో ఇది 12శాతం. వాయు కాలుష్య ప్రభావం చిన్న పిల్లలపైనే ఎక్కువగా ఉంది. ఐదేళ్లలోపు ఉన్న పిల్లలు 7 లక్షల మంది మరణించినట్టు నివేదిక తెలిపింది. ఈ మరణాల్లో 5లక్షల కంటే ఎక్కువ మరణాలు ఆఫ్రికా, ఆసియాలోనే నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణం బొగ్గు, కలప, పేడ వంటి ఇంధనాలు వంట చేయడానికి వాడటమేనని పేర్కొంది. 200కు పైగా దేశాల్లో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందిచనట్టు హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. యూనిసెఫ్‌తో కలిసి ఈ రిపోర్టును విడుదల చేసింది.

ప్రపంచంలోని దాదాపు ప్రతి వ్యక్తి ప్రతిరోజూ అనారోగ్యకరమైన గాలిని పీల్చుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90శాతానికి పైగా మరణాలు 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే సూక్ష్మ గాలి కాలుష్య కారకాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఈ సూక్ష్మమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాలుష్యాన్ని నియంత్రిస్తే అటువంటి వ్యాధులను అరికట్టొచ్చని నివేదిక అభిప్రాయపడింది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ ఓజోన్ కాలుష్యం అధ్వాన్నంగా మారుతుందని అంచనా వేసింది. ఈ కారణంగా కూడా 2021లో ఐదు లక్షల మంది మరణించారని తెలిపింది.

తరువాతి తరంపై తీవ్ర ప్రభావం: పల్లవి పంత్

ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుపానులు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ హెడ్ పల్లవి పంత్ తెలిపారు. దీనిని వీలైనంత త్వరగా నియంత్రించకపోతే తరువాతి తరంపై తీవ్రప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాయు కాలుష్యం ముఖ్యంగా మెదడును ప్రభావితం చేస్తుందని తెలిపారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం వల్ల కాలుష్యాన్ని అదుపులో ఉంచొచ్చని స్పష్టం చేశారు.


Similar News