Taiwan: తైవాన్‌కు ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదు.. లైచింగ్ తే కీలక వ్యాఖ్యలు

తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదని తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తే అన్నారు.

Update: 2024-10-10 09:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదని తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ తే అన్నారు. అది తైవాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. తైవాన్ జాతీయ దినోత్సవ సందర్భంగా గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. నిరంకుశత్వాన్ని విస్తరించడం ద్వారానే అనేక సవాళ్లకు దారితీసిందని తెలిపారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలకు శాంతి, పరస్పర శ్రేయస్సును కొనసాగించడానికి, ప్రాంతీయ భద్రత, వాతావరణ మార్పు, వంటి సమస్యలను పరిష్కరించేందుకు చైనాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. తైవాన్‌లోని 23 మిలియన్ల ప్రజలను ఏకం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అంతర్జాతీయ సమాజం అంచనాలకు అనుగుణంగా చైనా మెలగాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, పశ్చిమాసియాలో సంఘర్షణలను తగ్గించడానికి ఇతర దేశాలతో కలిసి పని చేయాలని తెలిపారు.  


Similar News