Turkey : విమానంలో మంటలు.. 95 మంది అరుపులు, కేకలు.. ఏమైందంటే..
దిశ, నేషనల్ బ్యూరో : రష్యాకు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ ప్రయాణికుల విమానం తుర్కియే(Turkey)లోని అంటాల్యా విమానాశ్రయంలో రఫ్‌గా ల్యాండ్ అయింది.
దిశ, నేషనల్ బ్యూరో : రష్యాకు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ ప్రయాణికుల విమానం తుర్కియే(Turkey)లోని అంటాల్యా విమానాశ్రయంలో రఫ్‌గా ల్యాండ్ అయింది. అకస్మాత్తుగా గాలి వీచే దిశ మారడంతో విమానం ల్యాండింగ్‌లో సమస్య తలెత్తిందని తెలుస్తోంది. అయితే ల్యాండ్ అయిన వెంటనే విమానం ఇంజిన్ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలో ఈ మంటలు మొత్తం విమానానికి వ్యాపించాయి. దీంతో అందులోని 89 మంది ప్రయాణికులు, ఆరుగురు క్రూ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ‘రక్షించండి’ అంటూ బిగ్గరగా అరిచారు. అంటాల్యా విమానాశ్రయానికి చెందిన రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది చొరవ చూపి విమానం(Russian plane)లోని మొత్తం 95 మందిని కాపాడి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రష్యాలోని అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ విమానం రష్యాలోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం సోచి నుంచి టర్కీలోని అంటాల్యాకు వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని రష్యా పౌర విమానయాన శాఖ ‘రోసా వయాత్సియా’ వెల్లడించింది. ప్రమాదానికి గురైన సుఖోయ్ సూపర్‌జెట్ విమానం గత ఏడేళ్లుగా వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది.