Wild life: 50 ఏళ్లలో 73 శాతం తగ్గిన వన్యప్రాణులు.. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
50 ఏళ్లలో ప్రపంచ వణ్యప్రాణుల సంఖ్య 73శాతానికి తగ్గిందని లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ 2024 నివేదికలో వెల్లడైంది.
దిశ, నేషనల్ బ్యూరో: 50 ఏళ్లలో ప్రపంచ వణ్యప్రాణుల సంఖ్య 73శాతానికి తగ్గిందని లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ 2024 నివేదికలో వెల్లడైంది. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 69శాతంగా ఉండగా ప్రస్తుతం 4 శాతం అధికం కావడం గమనార్హం. అటవీ నిర్మూలన, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే వాటి సంఖ్య తగ్గిందని నివేదిక అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారే చాన్స్ ఉందని హెచ్చరించింది. ఆసియా పసిఫిక్‌లో కాలుష్యం వన్యప్రాణుల జనాభాకు ముప్పుగా పరిణమించిందని ఈ ప్రాంతంలో సగటున 60శాతం క్షీణతను నమోదు చేస్తుందని తెలిపింది. మంచినీటి పర్యావరణ వ్యవస్థలలో 85 శాతం అత్యధికంగా క్షీణత నమోదు కాగా.. భూసంబంధ పర్యావరణ వ్యవస్థలో 69 శాతం, సముద్ర వ్యవస్థలో 56శాతం వన్యప్రాణులు క్షీణించాయి.
క్షీణించిన మూడు జాతుల రాబందులు
లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024 భారతదేశంలో మూడు జాతుల రాబందులు గణనీయంగా క్షీణించాయని వెల్లడించింది. వైట్-రంప్డ్ వల్చర్ (జిప్స్ బెంగాలెన్సిస్), ఇండియన్ రాబందు (జిప్స్ ఇండికస్), స్లెండర్-బిల్డ్ రాబందు (జిప్స్ టెన్యూరోస్ట్రిస్)లు తగ్గాయని తెలిపింది.1992 -2022 మధ్య వీటి సంఖ్య గణనీయంగా తగ్గింది. తెల్ల తోక రాబందుల సంఖ్య 67 శాతం, భారతీయ రాబందులు 48 శాతం, సన్నగా ఉండే రాబందుల సంఖ్య 89 శాతం తగ్గింది. అలాగే క్షీరదాలు, పక్షులు, తేనెటీగలు, ఉభయచరాలు, మంచినీటి తాబేళ్లలో అత్యధిక క్షీణతను నమోదు చేసినట్టు తెలుస్తోంది.
పెరిగిన పులుల సంఖ్య
భారతదేశంలో కొన్ని వన్యప్రాణుల సంఖ్య కాస్త మెరుగుపడింది. పులుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ 2022 ప్రకారం సుమారు 3,682 పులులు దేశంలో ఉండగా.. ఇది 2018లో అంచనా వేసిన 2,967 కంటే ఎక్కువ. మెరుగైన ప్రభుత్వ కార్యక్రమాలు, సమర్థవంతమైన నివాస నిర్వహణ, బలమైన శాస్త్రీయ పర్యవేక్షణ వంటి కారణంగా వీటి సంఖ్య పెరిగిందని నివేదిక అభిప్రాయపడింది. అయితే 70 శాతం పరిధిలోనే 718 చిరుతలు ఉన్నట్లు అంచనా వేసింది. కాగా, లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పడుతుంది. ఇది జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్), డబ్లూడబ్లూఎఫ్ సహకారంతో ఇండెక్స్‌ను రూపొందిస్తుంది.
రాబోయే ఐదేళ్లు కీలకం: డబ్లూడబ్లూఎఫ్ సీఈఓ రవిసింగ్
లివింగ్ ప్లానెట్ రిపోర్ట్‌పై వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్లూడబ్లూఎఫ్) సీఈఓ రవిసింగ్ మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లు ఎంతో కీలకమని తెలిపారు. ఈ కాలంలో మానవులు చేసే పనులపైనే వణ్యప్రాణుల భవిష్యత్ ఆధారపడుతుందని చెప్పారు. ప్రకృతి నష్టాన్ని ఆపడానికి, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టాన్ని పరిష్కరించడానికి రాబోయే ఐదేళ్లలో సమిష్టి కృషి అవసరమని చెప్పారు.