Maharashtra: షిండే రాజీనామా.. ఈ రోజు ఉదయం సీఎంపై వీడనున్న సస్పెన్స్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra CM) ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మంగళవారం రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis), అజిత్ పవార్‌లతో కలిసి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra CM) ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మంగళవారం రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis), అజిత్ పవార్‌లతో కలిసి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ సీపీ రాధాక్రిష్ణన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. కొత్త మంత్రివర్గం ఏర్పడేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ రాధాక్రిష్ణన్ సూచించారు. ఇందుకు షిండే అంగీకారం తెలిపారు. 23న వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి అఖండ విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి సీఎం ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. దేవేంద్ర ఫడ్నవీస్‌కు అవకాశమివ్వాలని బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నాయకులూ డిమాండ్ చేస్తుండగా మళ్లీ ఏక్‌నాథ్ షిండేకే చాన్స్ ఇవ్వాలని, బిహార్ మోడల్ అమలు చేయాలని శివసేన నేతలు పేర్కొంటున్నారు. అయితే, ఈ సస్పెన్స్ బుధవారం ఉదయం వీడే అవకాశముంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు సమావేశమవుతారని శివసేన నేత సంజయ్ శిర్సత్ తెలిపారు. ముగ్గురు నాయకులే సీఎం ఎవరనేది తేలుస్తారని వివరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తేల్చడంపై తొందరపడబోమని బీజేపీ నేత ఒకరు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై మిత్రపక్షాల్లో భిన్నాభిప్రాయాలు లేకుండా నిర్ణయాలు పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. కాగా, దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎంగా అవకాశమివ్వాలని కేంద్రమంత్రి, ఆర్పీఐ అథవాలే తన అభిప్రాయాన్ని తెలిపారు. ఏక్‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి లేదా కేంద్రమంత్రివర్గంలో చోటుకల్పించాలని సూచించారు.