Bangladesh: బంగ్లాదేశ్ ఘర్షణల్లో న్యాయవాది మృతి
చిట్టగాంగ్ బార్ అసోసియేషన్ సభ్యుడి హత్యకు నిరసనగా బుధవారం కోర్టు కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించామని ' రజాక్ తెలిపారు
దిశ, నేషనల్ బ్యూరో: ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేయడంపై బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో మంగళవారం పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణించినట్లు తెలుస్తోంది. సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే న్యాయవాది హత్యకు గురయ్యారని చిట్టగాంగ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నజీమ్ ఉద్దీన్ చౌదరి భారత జాతీయ మీడియాకు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. సైఫుల్ ఇస్లాం ఆరిఫ్‌ను అత్యంత కిరాతకంగా నరికి చంపారని చిట్టగాంగ్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అష్రఫ్ హుస్సేన్ రజాక్ తెలిపారు. 'చిట్టగాంగ్ బార్ అసోసియేషన్ సభ్యుడి హత్యకు నిరసనగా బుధవారం కోర్టు కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించామని ' రజాక్ తెలిపారు. చిట్టగాంగ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌గా ప్రభుత్వం ప్రకటించింది. చిట్టగాంగ్, రాజధాని ఢాకాలో అదనపు బలగాలను మోహరించింది. మంగళవారం ఉదయం చిట్టగాంగ్ కోర్టు ముందు హాజరుపరిచిన సమయంలో వందలాది మంది కృష్ణదాస్ అనుచరులు ఆవరణలో పెద్ద ఎత్తున గుమిగూడారు. ముందస్తు బెయిల్‌కు కోర్టు నిరాకరించిన అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో లాఠీఛార్జీ, సౌండ్ గ్రెనేడ్లు ఉపయోగించారు. ఈ క్రమంలోనే న్యాయవాది సైఫుల్‌పై దాడి చేయగా, ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించారు.