Trudeau: ప్రజల దృష్టి మరల్చేందుకే ట్రంప్ చూస్తున్నారు- ట్రూడో
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి టైంలో ట్రూడో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ట్రంప్ కెనడాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ట్రంప్ చాలా నైపుణ్యం కలిగిన సంధానకర్త. అమెరికా ప్రజలు చమురు, సహజ వాయువు, విద్యుత్, స్టీల్, అల్యూమినియం, కలప, కాంక్రీట్ వంటివన్నీ కెనడా నుంచే కొనుగోలు చేస్తున్నారు. మా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానన్న ఆయన.. వాటిని విధించే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకే విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికాలో కెనడా విలీనం ఎప్పటికీ జరగదు. మా ప్రజలు కెనడియన్లుగానే ఉండేందుకు ఇష్టపడతారు. టారిఫ్‌లు విధిస్తే వాటి ధరలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది’ అని ట్రూడో పేర్కొన్నారు. ఈసందర్భంగా అగ్రరాజ్యంలో కెనడా విలీనమయ్యే అవకాశమే లేదని కెనడా ప్రధాని మరోసారి తెలిపారు. 2018 వాణిజ్య వివాదం సమయంలో అమెరికా వస్తువులను లక్ష్యంగా చేసుకుని కెనడా కౌంటర్ టారిఫ్ లను ఉపయోగించడాన్ని కూడా ట్రూడో ప్రస్తావించారు. "కానీ ఈసారి మేం అలా చేయకూడదనుకుంటున్నాము. ఒకవేళ అలా చేస్తే.. ఇది కెనడియన్లకు ధరలను పెంచుతుంది. వాణిజ్య సంబంధాలు దెబ్బతీస్తుంది" అని ట్రూడో అన్నారు.
సుంకాల విధింపు
ఇకపోతే, ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత, కెనడా ప్రధాని ట్రూడో (Trudeau).. ట్రంప్‌తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాక, ఇందులో విఫలమైతే అమెరికా (USA)లో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలంటించారు. మరోవైపు.. ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈతరుణంలోనే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే తన ప్రతిపాదనను ట్రంప్ (Trump) మరోసారి లేవనెత్తారు. అయితే, అందుకు అవకాశమే లేదని ట్రూడో ఇప్పటికే స్పష్టతనిచ్చారు.