South Korea: దక్షిణ కొరియా, యూఎస్ సైనిక కసరత్తులు షురూ.. నార్త్ కొరియా తీవ్ర ఆగ్రహం

ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో దక్షిణ కొరియా, అమెరికాలు సోమవారం భారీ సైనిక కసరత్తులు ప్రారంభించాయి.

Update: 2024-08-19 09:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో దక్షిణ కొరియా, అమెరికాలు సోమవారం భారీ సైనిక కసరత్తులు ప్రారంభించాయి. 11 రోజుల పాటు ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి. ఇరు దేశాల సైనికులు సుమారు 40 ఫీల్డ్ వ్యాయామాలు చేపట్టనున్నారు.19,000 మంది దక్షిణ కొరియా సైనిక సిబ్బంది ఈ డ్రిల్స్‌లో పాల్గొననుండగా, అమెరికా సైనికుల సంఖ్యను వెల్లడించలేదు. విన్యాసాలు ప్రధానంగా పౌర రక్షణ, ఉత్తర కొరియా అణు దాడిని ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపైనే నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, జపాన్ దళాలతో శిక్షణ కోసం సుదూర బాంబర్లు, జలాంతర్గాములు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల ప్రాంతీయ విస్తరణను పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల తాజా సైనిక కసరత్తులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

యూఎస్, సౌత్ కొరియా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా స్పందించింది. మిత్ర దేశాలు దండయాత్ర ప్రారంభించాయని అభివర్ణించింది. ఈ మేరకు ఉత్తర కొరియా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమను రెచ్చగొట్టేందుకే యుద్ధ విన్యాసాలు చేపడుతున్నాయని పేర్కొంది. అయితే అమెరికా, దక్షిణ కొరియా తమ ఉమ్మడి కసరత్తులు కేవలం రక్షణాత్మకమైనవని అభివర్ణించాయి. సైనిక శిక్షణను విస్తరించడం కోసమేనని స్పష్టం చేశాయి. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దేశ రాజధాని ప్యోంగ్యాంగ్‌లో 250 అణు సామర్థ్యం గల క్షిపణి లాంచర్‌లను ఫ్రంట్‌లైన్ మిలిటరీ యూనిట్‌లకు అందజేసిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News