US visa denials: విద్యార్థి వీసా దరఖాస్తులపై అమెరికా కత్తెర

గతకొంతకాలంగా విద్యార్థి వీసాలపై అమెరికా కత్తెర వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41శాతం విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించింది.

Update: 2025-03-24 13:34 GMT
US visa denials: విద్యార్థి వీసా దరఖాస్తులపై అమెరికా కత్తెర
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: గతకొంతకాలంగా విద్యార్థి వీసాలపై అమెరికా కత్తెర వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41శాతం విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే F-1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయ్యాయి. అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2.79 లక్షల (దాదాపు 41శాతం) దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల (36శాతం) అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 1.73లక్షల (23శాతం) అప్లికేషన్లను అధికారు తిరస్కరించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. అయితే, దేశాలవారీగా రిజెక్ట్ అయిన వారి సంఖ్యను అమెరికా వెల్లడించలేదు.

9 నెలల్లోనే 38 శాతం వీసాల తగ్గింపు

ఇకపోతే, గతేడాది డిసెంబరు 9 వరకు ఉన్న లెక్కల ప్రకారం.. 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలు 38శాతం తగ్గినట్లు తెలిసింది. కొవిడ్‌ తర్వాత భారతీయ విద్యార్థులకు ఈ స్థాయిలో వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ నెలవారీ నివేదికల డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలను జారీ చేశారు. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉండటం గమనార్హం. కాగా.. నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్‌-1 వీసాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్‌ టైమ్‌ విద్యను అభ్యసించేందుకు అనుమతి లభిస్తుంది.

Tags:    

Similar News