Trump: ఇమిగ్రేషన్ పాలసీ వల్ల భార్య అరెస్టు.. చింతించట్లేదన్న ట్రంప్ మద్దతు దారుడు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమవలసదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసిపోయినా దేశంలోనే ఉంటున్న పెరూ మహిళ కామిలా మునోజ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమవలసదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసిపోయినా దేశంలోనే ఉంటున్న పెరూ మహిళ కామిలా మునోజ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇకపోతే, 2019లో స్టడీ, వర్క్ వీసాతో అమెరికాలోకి అడుగుపెట్టిన కామిలా.. బ్రాడ్లే బార్టెల్ అనే అమెరికన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరోనా ఆంక్షల కారణంగా వాయిదా వేసుకున్న హనీమూన్ ను ఇటీవలే వెళ్లారు. ఫిబ్రవరిలో ఈ దంపతులు ప్యూర్టోరికోకు హనీమూన్ కు వెళ్లారు. తిరిగి విస్కాన్సిన్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత కామిలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో అక్రమంగా ఉంటుందనే నేరారోపణతో జైలుకు పంపించారు. కాగా.. బార్టెల్ తన భార్య నిర్బంధంపై ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఇదంతా ఒక పీడకలలా ఉందని చెప్పుకొచ్చారు. వ్యవస్థలో లోపాలున్నాయని.. తన భార్యను బయటకు తెచ్చేందుకు చాలా టైం పడుతోందన్నారు. ఈ విషయంపై బార్టెల్ న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. వారికి ఒక లాయర్ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
ట్రంప్ కే ఓటేశా..
అంతేకాకుండా, తాను ట్రంప్ మద్దతుదారునని, మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కే ఓటేశానని బార్టెల్ చెప్పారు. ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం వల్లే తన భార్య అరెస్టు అయిందనే విషయం తెలుసని, అయినప్పటికీ తాను ట్రంప్ కు ఓటేసినందుకు చింతించడంలేదని అన్నారు. అమెరికన్లకు మంచి చేయడం కోసమే ట్రంప్ ప్రయత్నిస్తున్నారని బార్టెల్ అన్నారు. ప్రభుత్వ పాలసీలను ట్రంప్ ఇప్పుడు రూపొందించలేదని, ఉన్న వాటినే మరింత స్ట్రిక్ట్ గా అమలుచేస్తున్నారని వివరించారు. అయితే, ఈ విషయంలో తనకు చాలామంది విద్వేషపూరిత మెసేజ్ లు చేస్తున్నారని బార్టెల్ ఆరోపించారు. ట్రంప్ కు ఓటేసినందుకు మీకిలా జరగాల్సిందేనని, తగిన శాస్తి జరిగిందని ద్వేషపూరిత మెసేజ్ లు చేస్తున్నట్లు తెలిపారు. సంస్కరణ కోసం పిలుపునిస్తూ బార్టెల్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్(ICE) విమర్శించారు. ఐసీఈకి ఎటువంటి సమాచారం లేదనిపిస్తుందన్నారు. విభాగాల మధ్య మెరుగైన ప్రక్రియలు, మ్యూనికేషన్ కోసం వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తన భార్యను బహిష్కరిస్తే తాను కూడా పెరూకు వెళ్లాలని ఆలోచించానని చెప్పుకొచ్చాడు. ఇకపోతే, ట్రంప్ అక్రమ వలసదారులను జైలుకు పంపడమో, వారి స్వదేశాలకు తిప్పి పంపడమో చేస్తున్నారు. జనవరి నుండి అమెరికా 388 మంది భారతీయులను బహిష్కరించిందని ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. వారిలో 333 మందిని ఫిబ్రవరిలో మూడు సైనిక విమానాలలో తిరిగి పంపించారు.