స్పెయిన్‌లో ఆకాశమంతా ఆరెంజ్ రంగులోకి మారింది.. భూమి ఏంకాబోతుంది?!
ఎన్నో తీవ్రమైన పరిణామాలు ఇక్కడే చూడొచ్చు. Sky Turns Orange in Spain As Sahara Dust Phenomenon Sweeps.
దిశ, వెబ్‌డెస్క్ః ఈ భూమిపైన ఎన్నో వింతలు, అద్భుతాలతో పాటు భయంకరమైన ప్రకృతి విపత్తులు కూడా కనిపిస్తాయి. గడ్డ కట్టే చలి నుంచి మంటలు రేపే ఎండ వేడి.., ఎన్నో తీవ్రమైన పరిణామాలు ఇక్కడే చూడొచ్చు. ఈ క్రమంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన వాతావరణం మానవజాతిని భయాందోళనలకు గురిచేస్తుంది. తాజాగా, స్పెయిన్‌లో ఇలాంటి వాతావరణమే కనిపించింది. సహారా ఎడారి నుండి ఎగిరిన సన్నని దుమ్ము, ఇసుక స్పెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను దట్టంగా కమ్మేశాయి. ఈ ప్రభావంతో అక్కడ ఆకాశమంతా నారింజ రంగులోకి మారిపోయింది. వీధులన్నీ ఆరెంజ్ పూత పోసుకున్నాయి.
సోమవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఇది మొదలైన తర్వాత యూరప్‌లోని పలు దేశాలపై ఈ ప్రభావం ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. స్పెయిన్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ సహారా ఎడారి దుమ్ము ప్రభావంతో పర్యావరణలో ఎంత తీవ్రమైన పరిణామాలు ఏర్పడుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తుచేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఆ దేశంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యూనివర్శిటీ ఆఫ్ అలికాంటేలోని క్లైమాటాలజీ లాబొరేటరీ ఎవ్వరూ బయట తిరగవద్దని సూచన చేసింది. స్పెయిన్ పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా ప్రజలు బహిరంగ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, బయట ఉన్నప్పుడు ఫేస్ మాస్క్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలని హెచ్చరించారు. అయితే, ఇక్కడ మరో వింత దాగుంది. నిజానికి ఈ కాలుష్యం మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించినప్పటికీ ఈ ధూళి మేఘాలు అత్యంత వేడి ఎడారి సహారా నుండి పోషకాలతో నిండిన ఖనిజాలను సముద్ర జీవుల వద్దకు, వృక్షసంపద దగ్గరకు తీసుకొస్తాయి.
ఇక, సహారా నుండి వచ్చిన తాజా దుమ్ము తుఫాను "చాలా తీవ్రమైనది" అని స్పెయిన్ వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం వరకూ ధూళి పేరుకుపోవడం కొనసాగుతూనే ఉంది. అలాగే, నెదర్లాండ్స్, వాయువ్య జర్మనీ వరకూ ఈ దుమ్ము ఉత్తరం వైపుకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీని మూలంగా హానీ ఎంత ఉన్నా బంగారు కాంతితో వెలిగిపోతున్న ఆకాశం నెటిజన్లను అలరిస్తోంది. అదే సమయంలో గుండెల్లో భయాన్ని కలిగించేదిగానూ ఉంది. సహారాలో ఇప్పుడు ఏర్పడిన ఈ గాలి తుఫానుకు ప్రస్తుత పర్యావరణ మార్పుకు ఎంత లింకు ఉందో తేల్చాల్సి ఉన్నప్పటికీ , మానవ తప్పిదాలు ఇంతకంటే తీవ్రమైన ప్రకృతి వైపరిత్యాలకు దారితీస్తాయనడాన్ని మాత్రం ప్రపంచంలో అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.